
తమిళనాడు ఎన్నికలు: డీఎంకే–కాంగ్రెస్ కూటమిలోకి డీఎండీకే ఎంట్రీ?
8 నుంచి 10 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయింపుపై చర్చలు ..
తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే(DMK) నేతృత్వంలోని ఇండియా బ్లాక్ కూటమి తన రాజకీయ వ్యూహాన్ని మరింత బలపరుస్తోంది. డీఎండీకే కూటమిలో చేరేందుకు సిద్ధమవడం, రాహుల్–కనిమొళి భేటీతో డీఎంకే–కాంగ్రెస్ మధ్య విభేదాలు లేవని సంకేతాలివ్వడం—ఈ రెండు పరిణామాలు అధికార కూటమికి కీలక బలం జోడించాయి.
రాజ్యసభ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు..
2005లో దివంగత సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన డీఎండీకే.. డీఎంకే నేతృత్వంలోని కూటమితో చేతులు కలపడం ద్వారా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఎండ్ కార్డు పడినట్టయ్యింది.
డీఎండీకేకు 8 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించడంతో పాటు ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వనున్నట్లు డీఎంకే వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్‌కు విరుదునగర్ జిల్లాలో అసెంబ్లీ టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, డీఎండీకేతో పొత్తు చర్చలను తాను ప్రారంభించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) స్పష్టం చేశారు.
రాహుల్–కనిమొళి మీట్..
ఈ నేపథ్యంలో, డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల న్యూఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ డీఎంకే–కాంగ్రెస్ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి దోహదపడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
డీఎంకే–కాంగ్రెస్ భాగస్వామ్యం బలంగా, సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు కనిమొళి. తిరునెల్వేలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
“కూటమిని బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పటికే బలంగా ఉంది. ఎలాంటి విభేదాలు లేవు. కూటమి సంపూర్ణ సామరస్యంతో పనిచేస్తోంది” అని ఆమె చెప్పారు.
కొత్త పార్టీలు కూటమిలో చేరే అంశంపై స్పందించిన కనిమొళి.. “కొత్త పార్టీలు ఖచ్చితంగా డీఎంకే కూటమిలో చేరుతాయి. ఏ పార్టీలు చేరుతున్నాయో ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటిస్తారు” అని పేర్కొన్నారు. డీఎంకే, కాంగ్రెస్ చాలా ఏళ్లుగా మిత్రపక్షాలేనని, ఈ భాగస్వామ్యం భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని ఆమె పునరుద్ఘాటించారు.
సీట్ల పంపకాలపై రాహుల్ హామీ..
ఢిల్లీ సమావేశంలో పాలనలో అధికార భాగస్వామ్యం తమిళనాడు రాజకీయ సంప్రదాయంలో భాగం కాదని, దానిని పరిగణనలోకి తీసుకోబోమని కనిమొళి స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకాలపై చర్చలు కాంగ్రెస్ అధికారికంగా ఏర్పాటు చేసే కమిటీ ద్వారానే జరగాలని ఆమె నొక్కి చెప్పినట్లు సమాచారం.
రాహుల్ హామీ..
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) భవిష్యత్తులో జరిగే అన్ని సంప్రదింపులు సంస్థాగత ప్రోటోకాల్‌ల ప్రకారమే జరుగుతాయని, రెండు పార్టీలు ఐక్యతతో ముందుకు సాగుతాయని కనిమొళికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో అధికారిక సీట్ల పంపకాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, పరస్పర సహకారంతో నిర్ణయాలు తీసుకుంటామని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఎన్నికలకు ముందు అనవసరమైన విభేదాలు తలెత్తకుండా కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించాయి.
ప్రతిపక్షాల విమర్శలు..
ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. డీఎంకే–కాంగ్రెస్ కూటమి స్థితిని ప్రశ్నించిన ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే కాంగ్రెస్ పాత్రపై “గందరగోళంలో ఉందని” విమర్శించారు. రాహుల్ గాంధీతో చర్చల కోసం కనిమొళిని పంపడం ద్వారా డీఎంకే “ఢిల్లీకి లోబడి పనిచేస్తోందని” ఆయన ఆరోపించారు.
‘పార్టీని తాకట్టుపెట్టినోళ్లలాగా కాదు..’
దీనికి ప్రతిగా, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై తిరువారూరులో విలేకరులతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు.
“కనిమొళి రాహుల్ గాంధీని కలవడానికి ముఖం మీద టవల్ కప్పుకుని వెళ్లారా? మారువేషంలో వెళ్లారా? ధైర్యవంతురాలైన కనిమొళి తన సొంత కారులో బహిరంగంగానే వెళ్లారు. తమిళనాడు ప్రజలను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు రహస్యంగా వెళ్లినవారే అలా చేశారు” అని వ్యాఖ్యానించారు.
గత ఏడాది ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం అనంతరం బయటకు వచ్చినప్పుడు పళనిస్వామి తన ముఖాన్ని కండువాతో కప్పుకున్నారన్న ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. అయితే అన్నాడీఎంకే నాయకత్వం ఆ ఆరోపణలను ఖండించింది.

