పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ..
x

పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ..

తమిళనాడు ఎన్నికలకు టీవీకే 234 అభ్యర్థుల జాబితా విడుదల; అవినీతి రహిత పాలనకు విజయ్ హామీ.


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ మొత్తం 234 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ సమావేశం కేవలం తమ అభ్యర్థులను చూపడం కోసం కాదని, ప్రజల కోసం పోరాడే నాయకులను పరిచయం చేయడం కోసమని విజయ్ చెప్పారు. పార్టీ అభ్యర్థులు వృత్తిపరంగా రాజకీయ నాయకులు కాదని, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మంచి వ్యక్తులని చెప్పుకొచ్చారు. అనుభవం లేని వారిని బరిలోకి దింపుతున్నారన్న విమర్శలను ఆయన తిరస్కరించారు. అనుభవజ్ఞులు ఆ అనుభవాన్ని అవినీతికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండే వారినే ఎంపిక చేశానన్నారు.


టీవీకే Vs డీఎంకే..

2026 ఎన్నికలు టీవీకే, డీఎంకే మధ్య నేరుగా పోటీగా ఉంటాయని విజయ్ పేర్కొన్నారు. ప్రజలతో ఉన్న కూటమి టీవీకేదని, డీఎంకే కేవలం నాయకత్వంతోనే ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. ప్రజా డబ్బును దుర్వినియోగం చేయమని, అవినీతికి దూరంగా ఉంటామని, మహిళల భద్రతకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్య రహిత తమిళనాడుకు కృషి చేస్తామని చెప్పారు.


రెండు చోట్ల నుంచి..

పార్టీ జాబితాలో టి నగర్ నుంచి ఎన్ ఆనంద్ (బస్సీ ఆనంద్), విల్లివాక్కం నుంచి ఆదవ్ అర్జున వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమా, వ్యాపారం, సామాజిక సేవ రంగాలకు చెందిన పలువురు పేర్లు చోటు చేసుకున్నాయి.

కొత్త పార్టీ అయినప్పటికీ, టీవీకే ప్రజాదరణ, అవినీతి వ్యతిరేక అజెండా, యువత మద్దతుతో ఎన్నికల్లో సవాల్ విసురుతోంది. పాతుకుపోయిన డీఎంకేకు వ్యతిరేకంగా ఈ “ప్రజల కూటమి” ఎంతవరకు విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story