
ఇది బడా బాబుల బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పై సీపీఐ, సీపీఎం ల స్పందన.
కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితులు స్పందించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావులు స్పందించారు. ఈ బడ్జెట్ పెట్టుడి దారుల జేబులు నింపే బడ్జెట్ తప్ప మధ్యతరగతి, ఉద్యోగ, కార్మిక, కూలీలకు ఉపయోగం లేని బడ్జెట్ అన్నారు. రంగాలకు రాయితీలు అంటూ పెట్టుబడుల రంగాలపై ప్రభుత్వం సాయం పేరుతో పెట్టుబడులు ఉచితంగా పెడుతోందని, అలా చేస్తుందంటే బడా బాబులను బతికించి పేదలను చంపడమేనన్నారు.
జి ఈశ్వరయ్య, కార్యదర్శి, సీపీఐ.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదన్నారు. ఒక వర్గానికి ఈ సాయం బడ్జెట్ ద్వారా వచ్చిందని చెప్పేందుకు ఎక్కడా అవకాశం లేదన్నారు. విద్య, వైద్య రంగాలకు పేదలు, మధ్యతరగతి వారు తమ ఆదాయంలో 75 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ రంగాలకు నిధుల కేటాయింపు కంటితుడుపు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కొత్త వైద్యశాలకు అవకాశం ఇవ్వలేదు. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ రెండు రంగాలు వ్యాపార రంగంగా మారాయి. ఈ రంగాల్లో ప్రైవేట్ వారిని ప్రోత్సహించేల బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అని అన్నారు.
ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు. రాజధాని నిర్మాణం కోసం పైసా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు కూడా నిధులు బడ్జెట్ లో కేటాయించకపోతే ఈ ఏడాది ఎలా ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఈ అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే ఒక్క కేటాయింపు కూడా ఈ బడ్జెట్ లో లేదు. రైల్వే లైన్ లు ఒకటీ రెండు జిల్లాల నుంచి పోతున్నాయని ముఖ్యమంత్రి సంబర పడుతూ కేంద్ర బడ్జెట్ ను అభినందించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతూ ఏపీలో రెండు పట్టణాల్లో రైలు ఆగితే దానికి సంబర పడాలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తెప్పించుకోలేక పోవడం రాష్ట్ర పాలకులు చేతకాని తనాన్ని బయట పెట్టింది అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలో ప్రధానమైన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. విద్య, వైద్యం వ్యాపారమైంది. పెట్టుబడి దారులకు ఊడిగం చేసే బడ్జెట్ ప్రజల కోసం కాదని అర్థమైనా రాష్ట్ర పాలకులు చప్పట్లు కొట్టడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.
వి శ్రీనివాసరావు, కార్యదర్శి, సీపీఎం.
రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం లేదు. భారాలు ప్రజలపై రాయితీలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారని అంకెలు చూస్తే స్పష్టం. సంక్షేమం, విద్య, వైద్యానికి కోత, మహిళ సంక్షేమానికి రూ. 50వేల కోట్లు కోత వేశారు. షేర్ మార్కెట్ పడిపోయిందంటేనే ఇది పనికొచ్చే బడ్జెట్ కాదని స్పష్టమైంది. పోలవరం ప్రతిష్టాత్మకమైంది. ఇప్పటికిప్పుడు 12వేల కోట్లు అవసరమంటే ఇవ్వలేదు. నిర్వాసితులకు రూ. 21 వేల కోట్లు ఇవ్వాలి. నిర్వాసితుల కోసం ఇవ్వాల్సిన దాంట్లో ఐదు శాతం కూడా ఇవ్వలేదు. అప్పులు ఇచ్చి అవే నిధులు అనుకోవాలని భ్రమ పెడుతున్నారు. గ్రాంట్ తెచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఫెయిల్. వారానికోసారి ఢిల్లీకి పోయి ఏమి తెచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ నడవలేక మూలన పడిపోయింది. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. పెట్టుబడి దారులను అందలమెక్కించే బడ్జెట్. ఇటువంటి సర్కార్ కు ప్రజలు బుద్ధి చెప్పాలి.
రమాదేవి, ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి.
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాటలు గొప్పగా ఉన్నాయి. ఆచరణలో ఏ మాత్రం ఉపయోగం లేదు. ఉపాధి రంగానికి ఉపయోగం లేదు. గతంలో ఇచ్చే నిధులు కూడా ఈ బడ్జెట్ లో ఏపీకి ఇవ్వలేదు. వంద రోజులు పని కాదు కదా, 50 రోజుల పనికూడా ఉపాధిహామీ పథకంలో లేదు. జండర్ బడ్జెట్ లో కేటాయింపులకు, ఖర్చుపెట్టటానికి సంబంధం లేకుండా పోతోంది. గత సంవత్సరం కేటాయింపులో 75 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్ లో మరో లక్ష కోట్లు ఎక్కువ కేటాయిస్తున్నట్లు చెప్పినా ఖర్చు పెట్టే సరికి మళ్లీ 75 శాతం మాత్రమే ఉంటుంది. జండర్ లో ఏ గ్రూపులో మహిళ ఉంటుంది. మహిళలకు ఈ బడ్జెట్ ఏ మాత్రం ఉపయోగ పడదు.
చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ కోసం కూడా ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చు పెడుతోంది. దీని వల్ల పేదరికం మరింత పెరగటంతో పాటు నిరక్షరాస్యత కూడా పెరుగుతోంది.

