శ్రీవారిపై పగ పట్టారు : సీఎం చంద్రబాబు
x
కూటమి నేతలతో సీఎం చంద్రబాబు

శ్రీవారిపై పగ పట్టారు : సీఎం చంద్రబాబు

గత టీటీడీ చైర్మన్ పీఏకు రూ. 4 కోట్ల లంచం ముట్టినట్లు సమాచారం ఉందని, బోర్డు పెద్దలకు తెలిసే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.


కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతకు గత వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నిందని, దేవుడి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడి భక్తుల నమ్మకాన్నివమ్ము చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం కేవలం పొరపాటు కాదు.. అది పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా చేసిన చారిత్రక మహాపాపం అంటూ మండిపడ్ధారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో అత్యవసరంగా భేటీ అయిన ముఖ్యమంత్రి, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భగవంతుడి సాక్షిగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని కాలం కూడా క్షమించదని, ఈ అపచారానికి కారణమైన ప్రతి ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నివేదికలు ఉన్నా తొక్కిపెట్టిన వైనం

నెయ్యిలో కల్తీ జరుగుతోందని 2022లోనే సీఎఫ్‌టీఆర్ఐ స్పష్టంగా చెప్పినా, గత పాలకులు ఆ నివేదికను తొక్కిపెట్టి అపచారాన్ని కొనసాగించారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం లడ్డూ శాంపిళ్లను ఎన్డీడీబీ పరీక్షలకు పంపగా.. అందులో పామాయిల్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు వెలుగుచూసిందని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన చైర్మన్ పీఏకు రూ. 4 కోట్ల లంచం ముట్టినట్లు సమాచారం ఉందని, బోర్డు పెద్దలకు తెలిసే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.

భక్తి లేని వారే ఇలా చేస్తారు

హిందూ ధర్మం పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తులు అధికారంలో ఉండటం వల్లే ఇలాంటి దుర్మార్గాలు జరిగాయని చంద్రబాబు విమర్శించారు. అబ్దుల్ కలాం వంటి వారే డిక్లరేషన్‌పై సంతకం చేస్తే, గత పాలకులు మాత్రం నిబంధనలను బేఖాతరు చేశారని గుర్తు చేశారు. బ్రిటీషర్లు సైతం మన ఆచారాలను గౌరవించారని, కానీ గత పాలకులు వారి కంటే హీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్థం విగ్రహం ధ్వంసం వరకు 219 ఆలయాలపై దాడులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పాలకుల పగకు నిదర్శనమన్నారు.

దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

శ్రీవేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవమని, 2003లో 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ఆ స్వామి కృపతోనే ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పునర్జన్మ ఇచ్చిన దైవానికి జరిగిన అపచారాన్ని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తప్పు చేసి మళ్ళీ తమపైనే ఎదురుదాడి చేస్తున్న వైసీపీ నేతల రౌడీయిజం ఇకపై సాగదని స్పష్టం చేశారు. సీబీఐ నివేదికలో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని, అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీ నేతలు కరడుగట్టిన నేరస్తుల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ప్రక్షాళన దిశగా అడుగులు

జరిగిన మహాపాపంపై ఇతర పీఠాధిపతులతో చర్చించి ముందుకు వెళ్తామని చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించే సమస్యే లేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని, దోషులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి అపచారం చేయాలంటేనే భయపడేలా నిందితులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read More
Next Story