
సవాళ్లు..ప్రతిసవాళ్లతో హోరెత్తిన మండలి
లోకేశ్ వర్సెస్ బొత్సల లెక్కల పంచాయితీతో మండలి దద్దరిల్లింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విద్యాశాఖపై జరిగిన చర్చ రాజకీయ సెగలు పుట్టించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరుపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభ హోరెత్తిపోయింది.
రూ. 4 వేల కోట్ల బకాయిలు.. లోకేశ్ సంచలన ఆరోపణ
సభలో చర్చను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేసిందని, సుమారు రూ. 4 వేల కోట్లకు పైగా బకాయిలను పెండింగ్‌లో పెట్టి వెళ్లిందని ఆరోపించారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పనులు వేగవంతం చేశామని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు వినకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
దమ్ముంటే నిరూపించు.. బొత్స ఘాటు కౌంటర్
మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. మేము ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు.. రికార్డుల్లో ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నాం అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. లోకేశ్‌కు దమ్ముంటే అధికారులు, రికార్డుల సాక్షిగా బకాయిలను నిరూపించాలని సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.
బకాయిల లెక్కలివే .. ఎమ్మెల్సీల నిలదీత
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయాయని మండిపడ్డారు. ప్రస్తుతం రూ. 8,500 కోట్ల బకాయిలు ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 700 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, మిగిలిన రూ. 7,800 కోట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు-నేడు ద్వారా తాము పాఠశాలల రూపురేఖలు మారిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను మధ్యలోనే నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తేల్చుకుందాం రండి.. లోకేశ్ స్ఫష్టీకరణ
ప్రతిపక్షం వాకౌట్ చేసిన అనంతరం మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ వైసీపీ సభ్యులు సమాధానం వినే ధైర్యం లేక పారిపోతున్నారని విమర్శించారు. ఎదురుదాడి చేయడం ద్వారా వాస్తవాలను కప్పిపుచ్చలేరని, విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

