
సాక్షులకు రక్షణ లేదు..రఘురామను అరెస్టు చేయాల్సిందే: పీవీ సునీల్
సీబీఐకి ట్యాగ్ చేస్తూ పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరోసారి సంచలనంగా మారారు. రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును బ్యాంక్ మోసం కేసులో తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాక్షులను బెదిరించే అవకాశం ఉంది : సునీల్ కుమార్ ఆందోళన
మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పీవీ సునీల్ కుమార్ ఈ ట్వీట్ చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని రఘురామ కృష్ణంరాజు బెదిరించారని సునీల్ నాయక్ గతంలో ఆరోపించారు. దీనిని ఉటంకిస్తూ.. ఒక ఐపీఎస్ అధికారినే బెదిరించారంటే, ఇక సీబీఐ కేసుల్లోని సామాన్య సాక్షులను రఘురామ వదిలిపెడతారా? వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉంది అని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. సాక్షులను రక్షించాలంటే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవడమే సరైన మార్గమని ఆయన సీబీఐని కోరారు.
కోట్ల రూపాయల బ్యాంక్ స్కామ్ కేసు నేపథ్యం
రఘురామ కృష్ణంరాజుపై ఇప్పటికే సీబీఐ రెండు భారీ ఆర్థిక నేరాల కేసులను విచారిస్తోంది. సుమారు రూ. 947 కోట్లు , రూ. 238 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ విచారణ కొనసాగుతున్న తరుణంలో, సాక్ష్యాధారాలను తారుమారు చేసే లేదా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీవీ సునీల్ కుమార్ తన ట్వీట్‌లో నొక్కి చెప్పారు. దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోసారి రాజుకున్న మాటల యుద్ధం
గతంలో రఘురామ కృష్ణంరాజు కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో పీవీ సునీల్ కుమార్, రఘురామ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామపై ఒక సిట్టింగ్ ఐపీఎస్ అధికారి అరెస్టు డిమాండ్ చేయడం ఏపీ పాలిటిక్స్‌లో కొత్త మలుపులకు దారితీసేలా ఉంది.
IPS Sunil Naik accuses RRR of threatening him to depose false evidence. This must be verified by going through the CDR and IPDR. The reason is RRR is facing CBI cases: RCBD1/2019/E/0003 (₹947 Cr fraud), RCBD1/2021/E/0002 (₹238 Cr fraud) and other bank fraud cases. If Mr Naik's… pic.twitter.com/Mdl5CeG53e
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) February 26, 2026
Next Story

