
వైసీపీ అనుకూల ఓట్లను తొలగించే అవకాశం ఉంది: వైవీ సుబ్బారెడ్డి
రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాలు ఆడుతోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల జాబితా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాబోయే కాలంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ఓటర్ లిస్టును పరిశీలించుకోవాలని, అక్రమ తొలగింపులను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అరాచకాలను ఎదిరించి నిలబడదాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ దాడులు, హింసకు పాల్పడుతోందని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని విమర్శించారు. అయితే, ఎన్ని దాడులు చేసినా, ఎంత హింసించినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా వెనకడుగు వేయలేదని, ధైర్యంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. కూటమి అరాచకాలను ఎదురించి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్తలపై ఉందన్నారు.
రైతు సంక్షేమం గాలికొదిలేశారు..
గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకున్నామని వైవీ గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్క రైతును కూడా పట్టించుకోవడం లేదని, గత ఏడాది రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేశారో గ్రామగ్రామాన వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..
రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాలు ఆడుతోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మళ్లీ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని విమర్శించారు. గతంలో తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే ప్లాట్ల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదని, ఇప్పుడు రెండో దశ పేరుతో మరో 50 వేల ఎకరాలు తీసుకోవాలని చూడటం దోపిడీలో భాగమేనని ఆరోపించారు. అమరావతిని ఒక ఏటీఎంలా వాడుకుంటూ, టెండర్ల పేరుతో నిధులు కొల్లగొడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
Next Story

