
పుట్టా మహేష్ యాదవ్ మధ్యలో తండ్రి సుధాకర్ యాదవ్ (ఎడమ) యనమల (కుడి టాప్)
'పుటుక్కున' రాలిన 'పుట్టా', 'యనమల' కుటుంబాల వైభవం!
గంజాయి, కొకైన్ ఎంత కిక్కు ఇస్తుందో తెలియదు గాని కుటుంబ, పార్టీల పరువు మాత్రం బజారున పడింది ఎంపీ మహేష్ చేసిన పనితో..
వందల కోట్ల సంపద, దశాబ్దాల రాజకీయ పరపతి, రెండు రాష్ట్రాలు, రెండు ప్రాంతాల్లో విస్తరించిన బంధుత్వం.. పిలిస్తే పలికే అంగ, అర్థ బలాలు.. ఇవన్నీ ఒకే ఒక దెబ్బకు కూలిపోయాయి. రాజకీయ వైభవం మంటగలిసింది. పది మందిలో తలదించుకునేలా చేసింది. వీటన్నింటికీ కారణం ఒకే ఒక 'డ్రగ్ పార్టీ'.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన ఆ ఒక్క తప్పు, ఇప్పుడు కోస్తాలో యనమల రామకృష్ణుడు, రాయలసీమలో పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబాలను రాజకీయంగా 'వెలివేత'కు గురిచేస్తోంది. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్లకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా చేసింది.
నిండా 38 ఏళ్లు కూడా లేని పుట్టా మహేష్ కుమార్ సుమారు 16.50 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, సుమారు 600 గ్రామాల వాణిని పార్లమెంటులో వినిపించే నాయకుడు. అటువంటి వ్యక్తి, అపరకుబేరుడు.. పుటుక్కు జరజర డుబుక్కుమే అన్నట్టుగా చిన్న ప్రలోభానికి లోనైయ్యారు. పరువంతా పోగొట్టుకున్నారు. పదిమంది ముందు పల్చనయ్యారు.
తనను అభిమానించి, రాష్ట్రంలోనే పెద్దదైన ఏలూరు లోక్‌సభ సీటు ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ పెద్దల్ని తలవంచుకునేలా చేశారు. తాను తలదించుకోవడమే కాకుండా ప్రజల ముందూ ఎందుకూ కొరగాకుండా పోయారని స్వపక్ష, విపక్ష పార్టీల నేతలే చెబుతున్నారు.
ఆయన రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కురసాల కన్నబాబు మొదలు సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉదంతం ఈ నియోజకవర్గంలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కేలా చేసింది. ఇంతకాలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జంగారెడ్డిగూడెంలో గంజాయి సాగు ఆయనే చేయిస్తున్నారా అనే అనుమానాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి వెలుగు చూసిన అంధకారం
అది మార్చి 14, శనివారం రాత్రి. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ - అజీజ్‌నగర్ ప్రాంతం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో మ్యూజిక్ హోరెత్తుతోంది. ఖరీదైన విదేశీ మద్యం, నిషా కలిగించే కొకైన్.. అక్కడ ఉన్నది సామాన్యులు కాదు. చట్టాలను తయారు చేయాల్సిన ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, బడా వ్యాపారవేత్తలు.
తెలంగాణ 'ఈగల్' టీమ్ పోలీసులు గోడలు దూకి మెరుపు దాడి చేసినప్పుడు, అక్కడ జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. పోలీసులపైకే తుపాకీ గురిపెట్టి గాలిలోకి కాల్పులు జరిపేంత తెగింపు. కానీ, తీరా పరీక్షలు చేస్తే తేలిందేమిటి? సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రక్తంలో 'డ్రగ్స్' ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఒక్క తప్పు.. రెండు కుటుంబాల పతనం
ఈ ఉదంతం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత బలమైన రెండు కుటుంబాల ప్రతిష్టకు సంబంధించిన చావుదెబ్బ.
కోస్తా కోటలో యనమల: తెలుగుదేశం పార్టీలో మేధావిగా, మాజీ స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడుకి మహేష్ స్వయానా అల్లుడు. యనమల కుమార్తె భర్త ఈ మహేష్.
రాయలసీమలో పుట్టా: కడప జిల్లాలో బలమైన బీసీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఏకైక వారసుడు ఈ మహేష్. సుధాకర్ యాదవ్ టీటీడీ మాజీ ఛైర్మన్ కూడా.
"పుటుక్కుజరజర డుబుక్కుమే" అన్నట్టుగా.. దశాబ్దాల కాలంగా సంపాదించుకున్న గౌరవం, వేల కోట్ల సామ్రాజ్యం ఇప్పుడు ఈ డ్రగ్స్ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రతి ఒక్కరూ చులకనగా, హేళనగా మాట్లాడుతుంటే అటు తండ్రి ఇటు మామ తలలు దించుకునేలా చేశారు మహేష్.
వారసత్వానికి దక్కిన శాపం
1988లో జన్మించిన మహేష్ యాదవ్, జేఎన్టీయూ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. తండ్రి సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్‌గా ఉన్న కాలంలో ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుమల కొండపై అధికారం చెలాయించారు. మామ యనమల అండతో, కడప వ్యక్తి అయినప్పటికీ ఏలూరు ఎంపీ సీటు సాధించుకుని ఢిల్లీకి వెళ్లారు. అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన మహేష్, భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతారని అంతా భావించారు. కానీ, ఆయన స్నేహాలు, వ్యాపార సంబంధాలు (నితీష్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి వంటి వారితో) చివరకు ఆయనను ఊబిలోకి నెట్టాయి.
చంద్రబాబు 'కఠిన' నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 'డ్రగ్స్ పై యుద్ధం' ప్రకటించారు. కన్నబిడ్డలా చూసుకునే పార్టీ నేత అల్లుడు అని కూడా చూడకుండా, మహేష్ కుమార్‌ను పార్టీ పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. "చట్టం ఎవరికీ చుట్టం కాదు" అనే సంకేతాన్ని బాబు స్పష్టంగా పంపారు. దీంతో అటు యనమల, ఇటు పుట్టా కుటుంబాలు ఇప్పుడు సొంత పార్టీలోనే 'వెలివేత'కు గురివుతున్నామనే ఆవేదనలో కుమిలిపోతున్నాయి.
సంచలనాలకు నిలయం.. ఆ ఫామ్ హౌస్
గతంలో దేశవ్యాప్త సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కూడా ఇదే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో బయటపడింది. ఇప్పుడు అదే స్థలంలో డ్రగ్స్ దొరకడం, ఎంపీ స్థాయి వ్యక్తి అరెస్ట్ కావడం యాదృచ్ఛికం కాదు. పోలీసుల వైపు తుపాకీ గురిపెట్టిన నమిత్ శర్మ ఉదంతం చూస్తుంటే, ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమైనదో అర్థమవుతుంది.
పాఠం నేర్పుతున్న కాలం
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. తనకున్న రాజకీయ వారసత్వం, తనపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది కార్యకర్తలు గుర్తొచ్చి ఉంటే మహేష్ ఆ పార్టీకి వెళ్లేవారు కాదు. వేల కోట్ల సంపద ఉన్నా, వందలాది మంది మద్దతు ఉన్నా.. 'క్యారెక్టర్' ఒక్కసారి మంటగలిస్తే తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం. పుట్టా, యనమల కుటుంబాల ప్రస్తుత పరిస్థితి రాబోయే తరానికి ఒక హెచ్చరిక. ఒకే ఒక్క తప్పు.. చాలా ఖరీదైన తప్పు!
Next Story

