మండలిని కుదిపేస్తున్న శ్రీవారి లడ్డూ చర్చ
x

మండలిని కుదిపేస్తున్న శ్రీవారి లడ్డూ చర్చ

అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు సభలో రణరంగాన్ని తలపించింది.


అమరావతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బుధవారం ఒక యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కోట్లమంది హిందువుల ఆరాధ్యదైవం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం సభలో చిచ్చురేపింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటి.. ఒకరిపై ఒకరు దూసుకెళ్లే వరకు వెళ్లింది. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లంచాల భాగోతంపై ప్రభుత్వం 20 పేజీల సంచలన నివేదికతో విరుచుకుపడగా.. మరోవైపు ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. భక్తుల మనోభావాలు, రాజకీయ విమర్శలు, సభ్యుల మధ్య భౌతిక ఘర్షణల మధ్య సాగిన ఈ రణరంగ చర్చ.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

హెరిటేజ్ ప్రస్తావన.. మంత్రుల ఆగ్రహం
వైసీపీకి మద్దతుగా చర్చను ప్రారంభించిన స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.. సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పేరును ప్రస్తావించడంతో సభలో సెగలు రేగాయి. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ.. లడ్డూ కల్తీకి హెరిటేజ్‌కు అసలు సంబంధమే లేదని, కావాలనే చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదని నిలదీశారు.
20 పేజీల కల్తీ నివేదిక.. లంచాల గుట్టు రట్టు
ప్రభుత్వం ఈ సందర్భంగా 20 పేజీల సమగ్ర ప్రకటనను సభ ముందుంచింది. వైసీపీ హయాంలో జరిగిన లోపాలను ప్రభుత్వం ఆధారాలతో సహా వివరించింది. 2020లో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెయ్యి టెండర్ నిబంధనలను కావాలనే సడలించారని పేర్కొంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారులను బెదిరించి కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు విచారణలో రుజువైందని ప్రభుత్వం వెల్లడించింది. నిందితుల్లో కొందరు ఇప్పటికే తమ నేరాన్ని అంగీకరించారని, డెయిరీ నిపుణులు కూడా తప్పుడు సలహాలిచ్చి లాభపడ్డారని స్పష్టం చేసింది.
చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు: పయ్యావుల
మండలిలో ఒకే అంశంపై రెండు తీర్మానాలను అనుమతించడంపై మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బట్టకాల్చి ముఖాన వేసి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయంలో వాకౌట్ చేస్తామంటే కుదరదు అని మంత్రి పయ్యావుల ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌కు దేవుడిపై నమ్మకం లేదని, కనీసం సభ్యులైనా భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు.
సభ్యుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
చర్చ ముదురుతున్న క్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురు సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో సహచర సభ్యులు వారిని అడ్డుకున్నారు. నినాదాలు, అరుపులతో సభ కాసేపు స్తంభించిపోయింది. శ్రీవారి ప్రసాదం విషయంలో నిజాలు ప్రజలకు తెలియాలని ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రతిపక్షం మాత్రం ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
Read More
Next Story