
అది నెయ్యి కాదు.. దేవుడిపై పగ : వైసీపీపై కస్సుమన్న పవన్
2022లోనే కల్తీ నెయ్యిపై CFTRI నివేదిక ఇచ్చినా గత ప్రభుత్వం దానిని తొక్కిపెట్టిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని, అది కోట్లాది మంది హిందువుల విశ్వాసాలపై గత పాలకులు చేసిన దాడి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వారసత్వం నుంచి వచ్చిన వారు.. తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారు అంటూ వైసీపీ హయాంలో అపచారాలు జరిగాయని మండిపడ్డారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్నది పచ్చి నిజమని, భగవంతుడిపై పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోక తప్పదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కల్తీ నెయ్యి పాపంలో దోషులు ఎంతటి వారైనా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టబోదని, ఈ చారిత్రక అపరాధానికి తప్పు చేసిన వారు ఏడుకొండలవాడి పాదాల చెంత ముక్కు నేలకు రాయాల్సిందేనని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ తయారీ కోసం వినియోగించిన ద్రావణం అసలు పాల నుంచి వచ్చింది కాదని, అది కేవలం రసాయనాల మిశ్రమమని పవన్ కళ్యాణ్ సంచలన విషయాలు బయటపెట్టారు. వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా అయిన 59.70 లక్షల కిలోల నెయ్యిలో.. దాదాపు 58 లక్షల కిలోలు పామాయిల్, మిగిలింది రసాయనాలేనని రికార్డులు ఉన్నట్టు తెలిపారు. జంతువుల కొవ్వు (బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు) లడ్డూలో కలిసిందని ఎన్డీడీబీ (NDDB) నివేదిక స్పష్టంగా చెబుతున్నా గత పాలకులు బుకాయించడం వారి నైజమని మండిపడ్డారు. ఈ అపచారం తిరుమలకే పరిమితం కాలేదని, దేశం మొత్తం ఎంతో భక్తితో ఎదురుచూసిన అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ వేడుకకు కూడా ఇదే కల్తీ నెయ్యితో చేసిన లక్ష లడ్డూలను పంపి హిందూ ధర్మంపై పగ తీర్చుకున్నారని పవన్ ధ్వజమెత్తారు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలను కల్తీ నీడలో ముంచేసిన ఈ వ్యవహారం క్షమించరాని అపచారమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనోభావాలతో ఆటలాడుకున్నారు
ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న అహంకారపూరిత ఆలోచనా విధానం ఉన్న వారే తిరుమల పవిత్రతను నిలువునా దిగజార్చారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 219 ఆలయాలపై దాడులు జరిగితే, వాటిని నిలువరించాల్సింది పోయి ప్రతి ఘటనను పిచ్చోడి పని అంటూ గత పాలకులు అత్యంత తేలికగా తీసిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం నుంచి అంతర్వేది రథం దగ్ధం వరకు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. లడ్డూ కల్తీకి సంబంధించి 2022లోనే నివేదికలు వచ్చినా, ఆ నిజాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి కోట్లాది మంది భక్తులకు కల్తీ ప్రసాదాన్ని తినిపించారని, ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, భక్తుల విశ్వాసాలపై చేసిన వ్యవస్థీకృత దాడి అని పవన్ నిప్పులు చెరిగారు.
క్షమాపణ చెప్పి తీరాల్సిందే
శ్రీవారి సన్నిధిలో అపచారం చేసిన వారు భగవంతుడికి మొకరిల్లే వరకు ఈ ధర్మ యుద్ధం ఆగేది లేదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి పాపంలో భాగస్వాములైన దోషులు ఎంతటి వారైనా సరే, కూటమి ప్రభుత్వం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అత్యంత బలమైన హెచ్చరిక జారీ చేశారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోతారు అని మండిపడుతూ.. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, కోట్లాది మంది భక్తుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. తాము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నందున, ఏది పడితే అది మాట్లాడబోమని, నివేదికల ఆధారంగా, పూర్తి సంయమనంతోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని పవన్ వివరించారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసి, ఇప్పుడు బుకాయిస్తున్న వారు ఏడుకొండలవాడి పాదాల చెంత ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

