
పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్.. అసోం సీఎం భార్య ఫిర్యాదు కేసులో రిలీఫ్
అసోం సీఎం భార్య ఫిర్యాదు కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు..వారంరోజుల గడువు
అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ భార్య దాఖలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ సుజనా ఉత్తర్వులు జారీ చేశారు. ఖేరాకు కోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ, సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు వారం గడువు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఆయనపై ఎలాంటి అరెస్ట్ చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం..
అసోం ముఖ్యమంత్రి భార్యకు విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో ఖేరాపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. విచారణ సమయంలో ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఖేరాను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తారని కోర్టుకు వివరించారు.
ఖేరా పరారీలో లేరని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని సింఘ్వీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో పెద్ద సంఖ్యలో పోలీసులను పంపడం సరైన చర్య కాదని విమర్శించారు. ఇటువంటి చర్యలను “జంగిల్ రాజ్”లా వ్యవహరించడం అని ఆయన అభివర్ణించారు.
“రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని సింఘ్వీ వ్యాఖ్యానించారు.
ఇక అసోం ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ దేవజిత్ సైకియా వాదనలు వినిపించారు. ఖేరాను “అంతర్జాతీయ ఖిలాడీ”గా అభివర్ణిస్తూ, పోలీసులను తప్పించుకునేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఆయన ఇంటి నుంచి విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ఖేరాకు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుపై తదుపరి విచారణ సంబంధిత కోర్టులో కొనసాగనుంది.

