
టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు (ఫైల్ ఫోటో)
నెల్లూరు తీరంలో 'చేపల వేట': టీడీపీ ఎంపి బీద మస్తాన్ కు రాజకీయ సెగ!
తమిళనాడు బోట్ల వివాదం.. ఎంపీ బీదపై అసత్య ప్రచారమా? లేక రాజకీయ కుట్రనా?
నెల్లూరు రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన సీనియర్ నేత, టీడీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు (BMR) చుట్టూ ప్రస్తుతం తీవ్రమైన వివాదం ముసురుకుంది. బలహీన సామాజికవర్గం నుంచి ఎదిగిన ఆయన, అదే వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల మధ్య సాగుతున్న వేట యుద్ధం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదంలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏమిటా వివాదం?
వివాదానికి ప్రధాన కారణం తమిళనాడు మెకనైజ్డ్ బోట్లు- ఏపీ మత్స్యకారుల మధ్య ఘర్షణ. నెల్లూరు తీర ప్రాంతంలో తమిళనాడుకు చెందిన పెద్ద బోట్లు అక్రమంగా వేట సాగిస్తూ, స్థానిక ఏపీ మత్స్యకారుల వలలను తెంచేయడం, మత్స్య సంపదను దోచుకెళ్లడంపై గత కొంతకాలంగా ఉద్రిక్తతలు ఉన్నాయి.
ఈ క్రమంలో, ఎంపీ బీద మస్తాన్ రావు తమిళనాడు బోట్ల యజమానులకు మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. ఈ అంశం సెన్సేషన్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రధాన రియాక్షన్స్ ఇలా ఉన్నాయి..
మత్స్యకార వర్గాల నుంచి ఆగ్రహాన్ని, ఆవేదనను ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తం చేస్తున్నారు.
"తమిళనాడు బోట్లు వచ్చి మా వలలు తెంచేస్తుంటే, మా పొట్ట కొడుతుంటే మా నాయకులే వారికి సాయం చేయడం ఏమిటి? ఇది మా జాతికి జరుగుతున్న అన్యాయం." అని ఒకరు,
మత్స్యకార గ్రామాల్లో (జువ్వలదిన్నె, ఇసుకపల్లి వంటి ప్రాంతాల్లో) ఎంపీ వివరణపై ఇంకా నమ్మకం కలగలేదని, ప్రత్యక్షంగా చర్చకు రావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
విపక్ష పార్టీల నేతలు ఈ అవకాశాన్ని ఎంపీని ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారు.
"వ్యాపార ప్రయోజనాల కోసం సొంత జిల్లా మత్స్యకారులను బీద మస్తాన్ రావు బలి ఇస్తున్నారు. అందుకే ఆయన తమిళనాడు వైపు మొగ్గు చూపుతున్నారు." అంటూ #SaveNelloreFishermen #BeedaMastanRaoControversy వంటివి ట్రెండ్ అవుతున్నాయి.
టీడీపీ శ్రేణులు, ఎంపీ అనుచరులు ఆయనకు అండగా నిలుస్తున్నారు.
"బీద మస్తాన్ రావు ఎప్పుడూ మత్స్యకారుల పక్షపాతి. ఆయన ఎదుగుదలను చూడలేక కొందరు కావాలని చేస్తున్న కుట్ర ఇది. ఆయన స్వయంగా విచారణ కోరారంటేనే ఆయన నిజాయితీ అర్థమవుతోంది." అని టీడీపీ మద్దతు దారులు కౌంటర్ చేస్తున్నారు.
బీద మస్తాన్ రావు పెద్ద వ్యాపారవేత్త కావడంతో, ఆయన వ్యాపార సంబంధాల కోసమే తమిళనాడు వారికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వచ్చాయి.
సొంత సామాజికవర్గంలో అసంతృప్తి
మత్స్యకారుల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా పేరున్న బీద, ఇప్పుడు అదే మత్స్యకారుల పొట్ట కొట్టే తమిళనాడు బోట్లకు సాయం చేస్తున్నారన్న ప్రచారం ఆయన ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది.
"నాపై కుట్ర జరుగుతోంది!"- బీద మస్తాన్ రావు
తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ బీద మస్తాన్ రావు శనివారం నెల్లూరులో మీడియా సాక్షిగా విరుచుకుపడ్డారు. "నేను ఏ అధికారితోనూ, ఏ గ్రామస్థుడితోనూ తమిళనాడు బోట్ల విషయంలో మాట్లాడలేదు. ఇవన్నీ కేవలం నాపై జరుగుతున్న అసత్య ప్రచారాలు" అని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయనే స్వయంగా సీఎం చంద్రబాబును కోరారు. నిజానిజాలు విచారణలో తేలాలని డిమాండ్ చేశారు.
ఏపీ-తమిళనాడు మత్స్యకారుల వివాదాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.
బీద మస్తాన్ రావు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేత. నెల్లూరు జిల్లాలో ఆయనకు గట్టి పట్టు ఉంది. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మత్స్యకారులను రెచ్చగొట్టి, ఆయన రాజకీయ పునాదులను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
సొంత వర్గం నుంచే విమర్శలు ఎదుర్కోవడం బీద మస్తాన్ రావుకు రాజకీయంగా పెద్ద సవాలే.
Next Story

