కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్..తిట్టినోళ్లకు సెంట్రల్ జైలా?
x

కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్..తిట్టినోళ్లకు సెంట్రల్ జైలా?

అంబటితో ములాఖత్ అనంతరం ఉండవల్లి సంచలన విమర్శలు గుప్పించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేసుల నమోదు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు (ములాఖత్). ఈ పరామర్శలో మాజీ మంత్రి కన్నబాబు కూడా పాల్గొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కొత్త ఒరవడి.. ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. భౌతిక దాడులు చేసిన వారికి, పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్‌లు లభిస్తుంటే.. కేవలం విమర్శలు చేసిన వారిని సెంట్రల్ జైలుకు పంపడం ఏ రకమైన న్యాయం? అని ఉండవల్లి ప్రశ్నించారు. ఒకే వ్యక్తిపై 30కి పైగా చోట్ల ఫిర్యాదులు చేయించడం, పాత కేసులను తవ్వి తీస్తూ పీటీ (PT) వారెంట్లు జారీ చేయడం పక్కా కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక సరికొత్త, ప్రమాదకరమైన ఒరవడికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.

పోలీసుల అత్యుత్సాహం

మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తున్న తీరును పరిశీలిస్తే పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఒక కేసులో ఊరట లభిస్తుందనుకున్న తరుణంలోనే, మరో పాత కేసును తెరపైకి తెచ్చి ఆయనను జైలుకే పరిమితం చేస్తున్న వైనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఒకటి వస్తే ఇంకొకటి..

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అంబటి రాంబాబుకు సోమవారమే గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఆయన జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. అయితే, ఆ సంతోషం గంట కూడా నిలవలేదు. గతంలో జరిగిన మెడికల్ కాలేజీల ఆందోళన కేసును సాకుగా చూపుతూ పోలీసులు వెంటనే పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఒక కేసులో బెయిల్ రాగానే, మరో కేసులో నిందితుడిగా చూపిస్తూ అరెస్ట్ చేయడం పోలీసుల వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.

తీరని రిమాండ్ కష్టాలు

ఈ పాత కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల సాంకేతికంగా ఒక కేసులో బెయిల్ లభించినప్పటికీ, మరో కేసులో రిమాండ్ ఉండటంతో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకే పోలీసులు పాత కేసులను తవ్వి తీస్తున్నారని, ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ఉండవల్లి మండిపడ్డారు.

Read More
Next Story