
వైసీపీ వాకౌట్‌పై స్పీకర్ ’11‘ సెటైర్
వైసీపీ మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ వాయిదా పడిన అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ వాకౌట్‌పై చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
11వ తేదీ.. 11 నిమిషాలు.. స్పీకర్ అయ్యన్న మార్క్ సెటైర్
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చటించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ సభ్యుల తీరుపై తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ నేతలు వాకౌట్ చేయడాన్ని ఆయన ఒక వింత 'నంబర్ గేమ్'తో పోల్చారు. ’ఈరోజు 11వ తేదీ.. వైసీపీ నుంచి వచ్చింది 11 మంది సభ్యులు.. వారు సభలో ఉండింది కూడా కేవలం 11 నిమిషాలు మాత్రమే.. అంతకు మించి వారు సభలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు‘ అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తేనే వ్యవస్థకు గౌరవమని ఈ సందర్భంగా స్పీకర్ హితవు పలికారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమ ప్రతినిధులను సభకు పంపిస్తారని, అలాంటిది ప్రజా సమస్యలపై చర్చించకుండా, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండా ఇలా తక్కువ సమయంలోనే వెళ్లిపోవడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నిరసనలు ఎలా ఉన్నా, సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పీకర్ స్పష్టం చేశారు.
వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కమిటీ హాల్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల వైఖరిని, వారి వ్యూహాలను నిశితంగా గమనిస్తూ.. టీడీపీ ,జనసేన, బీజేపీ సభ్యులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా, వైసీపీ మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి, తప్పుడు సంకేతాలు పంపేలా వారి కుట్రలు ఉన్నాయని, మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పన్నాగాకారుల ఎత్తుగడలను సభ్యులందరూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు.

