లడ్డూపై మండలిలో చర్చించాలా? వద్దా?..కాసేపట్లో క్లారిటీ
x

లడ్డూపై మండలిలో చర్చించాలా? వద్దా?..కాసేపట్లో క్లారిటీ

బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి లడ్డూ అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని కుదిపేస్తోంది. ఈ సున్నితమైన అంశంపై పెద్దల సభలో చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ భీష్మించుకోవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో చర్చకు అనుమతి లభిస్తుందా లేదా అనే అంశంపై మరికొద్ది సేపట్లో స్పష్టత రానుంది.

అసెంబ్లీలో కాదు.. మండలిలో చర్చించాలి: బొత్స

అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో ఏం చేస్తారో అది మీ ఇష్టం.. మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి అని ఆయన తేల్చి చెప్పారు. దేవదేవుడి అంశంపై రాజకీయ నిందలు పడకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

వాయిదా తీర్మానం తిరస్కరణ - పోడియం వద్ద ఆందోళన

సోమవారం శాసన మండలి ప్రారంభమైన తర్వాత సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ వ్యవహారంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం మొదలైంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయగా, వారికి పోటీగా కూటమి ఎమ్మెల్సీలు కూడా ఆందోళనకు దిగారు. ఇరుపక్షాల నినాదాలతో సభ హోరెత్తిపోవడంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

బీఏసీ సమావేశంపైనే అందరి దృష్టి

సభ వాయిదా పడిన వెంటనే మండలి ఛైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్న బీఏసీ (Business Advisory Committee) సమావేశం అత్యంత కీలకంగా మారింది. లడ్డూ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఛైర్మన్ దీనికి ఏ ఫార్మాట్‌లో అనుమతిస్తారు? అనే అంశాలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వర్గాల కళ్లు ఇప్పుడు బీఏసీ నిర్ణయంపైనే ఉన్నాయి.

Read More
Next Story