యూడీఎఫ్ స్టార్ క్యాంపెయినర్‌గా శశి థరూర్..
x

యూడీఎఫ్ స్టార్ క్యాంపెయినర్‌గా శశి థరూర్..

‘‘రచయితగానే కాకుండా, విస్తృత సంబంధాలున్న ప్రజా నాయకుడిగా పేర్కొన్న శశి థరూర్‌ రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారు’’- వీడీ సతీశన్


Click the Play button to hear this message in audio format

కేరళ తిరువనంతపురం(Thiruvananthapuram) ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్‌(Congress)తోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరపున ప్రచారం చేస్తానని కూడా చెప్పారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.

శనివారం (జనవరి 31) మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, యూడీఎఫ్ కూటమి విజయమే తన లక్ష్యమన్నారు. పార్టీ, కూటమి విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటానని పేర్కొన్నారు.

తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రశ్నలకు ముగింపు పలుకుతూ.. తాను ఒకే పార్టీ కాంగ్రెస్‌తో ఉంటానని, ఈ విషయంలో మళ్లీ మళ్లీ ప్రశ్నలు అడగవద్దని మీడియాను కోరారు. శుక్రవారం కూడా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎక్కడికీ వెళ్లే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

‘‘స్టార్ క్యాంపెయినర్‌గా థరూర్..’’

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు యూడీఎఫ్ స్టార్ క్యాంపెయినర్‌గా థరూర్‌ను పార్టీ నాయకత్వం నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన సమావేశమైన తరువాత రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశం అనంతరం "అంతా బాగానే ఉంది, మనమంతా ఒకే అభిప్రాయంతో ఉన్నాం" అని వ్యాఖ్యానించడంతో ఎన్నికల ముందు పార్టీలో ఏర్పడ్డ అంతర్గత ఉద్రిక్తతకు తెరపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘140 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.’’

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ మాట్లాడుతూ.. ప్రచారంలో థరూర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయితగా, విస్తృత ప్రజా సంబంధాలున్న నాయకుడిగా థరూర్‌ను ఆయన అభివర్ణించారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ థరూర్ ప్రచారం చేస్తారని తెలిపారు.

‘‘మీడియా అలా అర్థం చేసుకుంది..’’

ఇదిలా ఉండగా.. విదేశాంగ విధానంపై తన అభిప్రాయాల కారణంగా వచ్చిన విమర్శలను కూడా థరూర్ ప్రస్తావించారు. కొన్ని మీడియా వర్గాలు తనను బీజేపీ అనుకూలుడిగా చిత్రీకరించాయని, కానీ తాను ప్రభుత్వానికి కాకుండా దేశ ప్రయోజనాల దృష్టితో మాట్లాడానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, పార్లమెంట్‌లో ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీతోనే నిలబడతానని కూడా తెలిపారు.

ఇటీవల కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన పేరు ప్రస్తావించకపోవడం వంటి ఘటనల కారణంగా తనను పక్కన పడుతున్నాననే వార్తలు వెలువడిన నేపథ్యంలో ..ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల వ్యూహ సమావేశానికి థరూర్ హాజరు కాలేదన్న వార్తలొచ్చాయి. ఆ పరిణామాల తరువాత ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

Read More
Next Story