
గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఇరువైపులా చంద్రబాబు, జగన్ ఉన్న గ్రాఫిక్
జగన్ సర్కార్‌ను పొగిడిన గవర్నరే ఇప్పుడు తెగడ్త! ఎందుకు?
“నా ప్రభుత్వం” నుంచి “గత ప్రభుత్వ తప్పిదాలు” వరకూ… అదే గవర్నర్, మారిన స్వరం
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తాజా ప్రసంగం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అందుకు కారణం- విమర్శల లక్ష్యం మాత్రమే కాదు, విమర్శించిన వ్యక్తి కూడా ఒకరే కావడం. 2023–24 సమావేశాల్లో ఇదే గవర్నర్ తన ప్రసంగాల్లో “నా ప్రభుత్వం” అంటూ అప్పటి జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలనా విధానాలను ప్రశంసించారు. అదే గవర్నర్, అదే అసెంబ్లీ వేదికపై, ఇప్పుడు (2026-2027 బడ్జెట్ ప్రసంగం) “గత ప్రభుత్వ పాలనలో ఏర్పడిన లోపాలు” అంటూ విమర్శాత్మక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజా ప్రసంగంలో 2019 తర్వాత రాష్ట్ర పరిపాలన దెబ్బతిన్నదని, వ్యవస్థాగత స్థిరత్వం కోల్పోయిందని, ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయని, అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని స్పష్టంగా ప్రస్తావించారు. రాష్ట్ర పునర్నిర్మాణం అవసరమైందని, ఆర్థిక క్రమశిక్షణ పునరుద్ధరణ అవసరమని పేర్కొన్నారు. మూడు రాజధానుల విధానం వల్ల పరిపాలనా అనిశ్చితి ఏర్పడిందన్న భావన కూడా ప్రసంగంలో ప్రతిధ్వనించింది.
ఇది గమనించిన రాజకీయ వర్గాలు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి- 2024 ఏప్రిల్ వరకు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిపాలనా మార్పులను ప్రశంసించిన గవర్నర్, ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని విమర్శించడం ఎలా చూడాలి? అని ప్రశ్నించారు ప్రముఖ న్యాయవాది నాగేంద్ర.
రాజ్యాంగ పరంగా చూస్తే- గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం సిద్ధం చేసిన విధాన పత్రం. అంటే ఆ ప్రసంగం గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం కంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. అందువల్ల 2023–24లో జగన్ ప్రభుత్వ విధానాలను సమర్థించిన ప్రసంగం, ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించింది. అదే విధంగా 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ దృక్పథాన్ని ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ప్రతిధ్వనిస్తోంది.
అయితే రాజకీయంగా చూస్తే ఇది “స్వరం మారిన గవర్నర్” అనే విమర్శకు దారి తీస్తోంది. వైఎస్సార్‌సీపీ వర్గాలు “ఆనాడు మంచిపనులంటూ చెప్పిన అంశాలే, ఇవాళ తప్పిదాలుగా ఎలా మారాయి?” అని ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు ప్రభుత్వ వర్గాలు “పాలన మారితే దృక్పథం మారడం సహజం” అని అంటున్నాయి. ప్రభుత్వాలు మారినా గవర్నర్ల వ్యవస్థ మారదు. పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు కొనసాగాలి. అలాంటప్పుడు రాజ్యాంగ పరమైన పోస్టులో ఉన్న గవర్నర్ గత ప్రభుత్వం తప్పులు చేసింది అనడం సరికాదేమోనని అభిప్రాయపడ్డారు నాగేంద్ర.
2023 బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ఏమన్నారంటే..
2023లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆనాటి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ఆ సమయంలో జగన్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదువుతూ, ఆయన అప్పటి ప్రభుత్వ విధానాలను, విజయాలను ఈ విధంగా కొనియాడారు:
సుపరిపాలన: గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అవినీతి లేని, పారదర్శకమైన పాలన సాగుతోందని ప్రశంసించారు.
నవరత్నాలు: "నవరత్నాలు" పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధిదారులకు మేలు జరుగుతోందని, నేరుగా నగదు బదిలీ (DBT) విధానం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
వృద్ధి రేటు: ఆంధ్రప్రదేశ్ 11.43% వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆనాడు సభలో ప్రకటించారు.
వ్యవస్థల బలోపేతం: గ్రామ/వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే చేరిందని అభినందించారు.
ప్రస్తుత ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు..
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలో గత ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పరిపాలనా అస్థిరత, ఆర్థిక క్రమశిక్షణ లోపం, పెట్టుబడుల తగ్గుదల, ప్రాజెక్టుల ఆలస్యం వంటి అంశాలతో పాటు మూడు రాజధానుల విధానం కూడా కీలక విమర్శగా ప్రస్తావించారు.
3రాజధానుల విధానం- పరిపాలనా గందరగోళం..
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి ఒకే రాజధాని అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల పరిపాలనా వ్యవస్థ దెబ్బతిన్నదని సూచించారు. మూడు రాజధానుల విధానం వల్ల పాలనలో అనిశ్చితి నెలకొన్నదని, అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని, పెట్టుబడిదారుల్లో సందేహాలు పెరిగాయని విమర్శాత్మకంగా ప్రస్తావించారు. పరిపాలనా కేంద్రీకరణ లేకపోవడం వల్ల నిర్ణయ ప్రక్రియ మందగించిందన్న భావనను ప్రసంగం ద్వారా వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థపై విమర్శలు..
గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర అప్పులు పెరిగాయని, ఆర్థిక నియంత్రణ లోపించిందని ప్రసంగంలో సూచించారు. అభివృద్ధి వ్యయాల కంటే అప్పు భారం ఎక్కువైందని, ఆదాయ-వ్యయ సమతుల్యత దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ అవసరాన్ని నొక్కిచెప్పారు.
పోలవరం వంటి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు మందగించాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం తగ్గిందని విమర్శించారు. పరిశ్రమల పెట్టుబడులు తగ్గడం, సహజ వనరుల వినియోగంలో లోపాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
శాంతిభద్రతల పరిస్థితి, పరిపాలనా వ్యవస్థలో సమన్వయం లోపించడం వంటి అంశాలపై కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్ హయాంలో ఆ ప్రభుత్వాన్ని "ప్రగతిశీల ప్రభుత్వం" గా అభివర్ణించారు, కానీ ఇప్పుడు అదే కాలాన్ని "చీకటి పరిపాలన" లేదా "వ్యవస్థల విచ్ఛిన్నం" గా పేర్కొనడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం కాకపోయినా, రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రభుత్వం ఇచ్చిన పత్రాన్ని చదవాల్సి రావడమే ఈ విచిత్ర పరిస్థితికి కారణం.
ఆర్టికల్ 176 ప్రకారం కేబినెట్ అధికారమే పరమావధి. భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ప్రసంగం అనేది 'కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్' (కేబినెట్) నిర్ణయించిన విధాన పత్రం. సంషేర్ సింగ్ vs స్టేట్ ఆఫ్ పంజాబ్ (1974) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లుగా, గవర్నర్ తన సొంత విచక్షణతో కాకుండా మంత్రిమండలి సలహా మేరకే ప్రసంగించాలి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కేబినెట్ ఇచ్చిన కాగితాన్ని చదవాల్సిందే. అయితే, ఒకవేళ ఆ ప్రసంగంలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఉంటే తప్ప, ఆయన దాన్ని మార్చలేరు.
ఒకే గవర్నర్ రెండేళ్లలో రెండు భిన్నమైన వాదనలు వినిపించడం చట్టపరంగా తప్పు కాకపోయినా, అది "రాజ్యాంగ నైతికత" (Constitutional Morality) దృష్ట్యా చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వం మారిన ప్రతిసారీ గవర్నర్ తన స్వరాన్ని మార్చుకోవాల్సి రావడం అనేది ఆ వ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నార్థకం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

