
థానే కోర్టులో రాహుల్ గాంధీ కొత్త పూచీకత్తు దాఖలు..
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మహాత్మా గాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆరోపించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదయిన పరువు నష్టం కేసులో శనివారం ఆయన మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టుకు హాజరయ్యారు. గతంలో రాహుల్‌కు ష్యూరిటీదారుడిని ఉన్న కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ డిసెంబర్‌లో మరణించారు. కొత్త పూచీకత్తు సమర్పించాలని భివాండి మెజిస్ట్రేట్ కోర్టు సూచించడంతో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్‌ను శివరాజ్ పాటిల్ స్థానంలో కొత్త ష్యూరిటీదారుడిగా చూపారు.
అసలు కేసేమిటి?
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్రలోని థానే జిల్లా సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో మహాత్మా గాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందని ఆరోపించారు. రాహుల్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆ సంస్థకు చెందిన కార్యకర్త రాజేష్ కుంటే కోర్టులో ఫిర్యాదు చేశారు. రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది.
మొదట విచారణను డిసెంబర్ 20, 2025కు నిర్ణయించారు. కొత్త పూచీకత్తు అవసరం కావడంతో జనవరి 17కు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 21కు మార్చారు.

