రోడ్లు తవ్విస్తారు..కేబుళ్లు ఎత్తుకుపోతారు: ఏబీవీ సంచలన విశ్లేషణ
x

రోడ్లు తవ్విస్తారు..కేబుళ్లు ఎత్తుకుపోతారు: ఏబీవీ సంచలన విశ్లేషణ

జగన్ మావిగన్ వ్యూహాన్ని చీల్చిచెండాడిన ఏబీ వెంకటేశ్వరరావు


రాష్ట్ర రాజకీయ యవనికపై అమరావతి సెగ మరోసారి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన మావిగన్ (MAVIGAN) వెనుక దాగున్న అసలు అంతరార్థం ఇదే అంటూ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) తనదైన శైలిలో చీల్చిచెండాడారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ వేదికగా ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపాయి. జగన్ మళ్లీ అడుగుపెడితే అమరావతి ఒక రాజధానిగా మిగులుతుందా లేక కేవలం అధికార పార్టీ కార్యకర్తలకు పంపకాలు జరిపే భూక్షేత్రంగా మారుతుందా? అన్న ఏబీవీ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి విధ్వంసానికి మావిగన్ ఒక ముందస్తు సంకేతం
అమరావతి అస్తిత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు జగన్ పన్నిన వ్యూహమే మావిగన్ అని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విశ్లేషించారు. అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు దక్కిన ప్రతిసారీ, దాని ప్రాభవాన్ని మసకబార్చేందుకు జగన్ ఏదో ఒక కొత్త ఎత్తుగడ వేస్తారని, అందులో భాగమే బెంగళూరు వేదికగా పుట్టుకొచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. రాజధానిని ఒక గ్లోబల్ హబ్ గా చూడాల్సిన చోట, దానిని కేవలం ఒక వర్చువల్ నెట్‌వర్క్‌గా పరిమితం చేయాలని చూడటం వెనుక అమరావతి ఖ్యాతిని అడ్డుకునే పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన హెచ్చరించారు.
జగన్ మళ్ళీ వస్తే.. అమరావతి అనే ఊసే ఉండదు అనే సంకేతాన్ని పరోక్షంగా ప్రజల్లోకి పంపి, పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు రేపడమే ఆయన అసలు ఉద్దేశమని ఏబీవీ ఆరోపించారు. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారని, ఈ కొత్త నినాదాలు కేవలం విధ్వంసానికి ముందు వచ్చే హెచ్చరికలేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రోడ్లు తవ్విస్తారు.. కేబుళ్లు ఎత్తుకుపోతారు
జగన్ మార్కు రాజకీయాల వెనుక వినాశకర కోణం ఉందంటూ.. ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత పదునైన పదజాలంతో ఎండగట్టారు. జగన్ మళ్ళీ అధికార పీఠం ఎక్కితే అమరావతిలో మిగిలేది అభివృద్ధి కాదు, అరాచకమేనని ఆయన హెచ్చరించారు. రాజధానిలోని విలువైన భూములను వైసీపీ కార్యకర్తలకు పంపకాలు చేస్తారు.. అభివృద్ధి పనులకు శాశ్వతంగా మంగళం పాడుతారు అని ఆరోపించారు. అంతటితో ఆగకుండా, అమరావతి కోసం నిర్మించిన రోడ్లను సైతం తవ్వించి, భూగర్భంలో అమర్చిన పైపులు, విలువైన కేబుళ్లను పెకిలించి ఎత్తుకుపోయే స్థాయికి విధ్వంసం చేరుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగబోయేది కేవలం పాలన కాదు, రాజధాని ఆస్తుల లూటీ అని ఏబీవీ చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పెట్టుబడిదారుల్లో వణుకు..కేంద్రం సహకారంపై సంచలన అనుమానాలు
అమరావతి భవిష్యత్తుపై జగన్ ఆడుతున్న రివర్స్ గేమ్ పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని ఏబీవీ విశ్లేషించారు. అసెంబ్లీలో రాజధానికి వ్యతిరేకంగా మళ్లీ తీర్మానాలు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టును నాశనం చేయాలని జగన్ చూస్తున్నారని, ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు లోపాయికారీగా సహకరిస్తుందనే ప్రచారం పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర వేల ఎకరాల భూములు మిగులు ఉండటం అభివృద్ధికి సంకేతం కాదు, అది రాజధాని మనుగడకే ప్రమాదకరం అని ఏబీవీ హెచ్చరించారు. అమరావతిపై నమ్మకం కలగాలంటే ఆ భూములను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వెంటనే ఉపాధి కల్పించే భారీ సంస్థలకు బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జగన్ మార్కు అనిశ్చితి వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
నాడు జైకొట్టి.. నేడు వెన్నుపోటు ఏబీవీ ఫైర్
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టిన జగన్, అధికారం చేజిక్కించుకోగానే రాజధానిపై ఏ విధంగా వ్యవహరించాలో అంటూ ఏబీవీ పూసగుచ్చినట్లు వివరించారు. చట్టసభలో అంగీకారం తెలిపి, బయట మాత్రం ఎన్జీటీ (NGT), సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు వేయడం, ఏకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేసి నిధులు రాకుండా అడ్డుకోవడం జగన్ నైజమని ఆయన మండిపడ్డారు. నాడు అంగీకారం తెలిపింది కేవలం అధికారం కోసమేనా? అని ప్రశ్నిస్తూ, జగన్ వేసిన ప్రతి అడుగు అమరావతిని అగాధంలోకి నెట్టడానికేనని ఆరోపించారు.
ప్రస్తుతం ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనని, క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగడమే దీనికి నిదర్శనమని ఏబీవీ ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ చిత్తశుద్ధి చూపకుండా.. మళ్లీ కొత్తగా భూ సమీకరణ పేరుతో కాలయాపన చేయడం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కంటే అడ్డంకులు సృష్టించడమే జగన్ అసలు ఎజెండా అని ఆయన ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.
Read More
Next Story