రిజైన్ ఎమ్మెల్సీల రివర్స్ అటాక్.. ఛైర్మన్‌పై అవిశ్వాసం
x

రిజైన్ ఎమ్మెల్సీల రివర్స్ అటాక్.. ఛైర్మన్‌పై అవిశ్వాసం

అవిశ్వాసం వ్యూహం ఎలాంటి ఫలితాలకు దారి తీస్తుందోనని ఆసక్తి నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై, ఆ తర్వాత ఆ పార్టీకి , తమ పదవులకు రాజీనామా చేసిన సభ్యులు ఇప్పుడు మండలి ఛైర్మన్ మోషేనురాజు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ రాజీనామాలను ఆమోదించడంలో ఛైర్మన్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐదుగురు ఎమ్మెల్సీలు, ఏకంగా ఆయనపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా యోచిస్తున్నట్లు సమచారం.

రాజీనామాలు ఆమోదించకపోవడంపై నిరసన
వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకటరమణ గతంలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, వారు రాజీనామాలు సమర్పించి నెలలు గడుస్తున్నా, మండలి ఛైర్మన్ మోషేనురాజు వాటిని ఇంతవరకు ఆమోదించలేదు. రాజీనామా చేసినా సాంకేతికంగా తమను పార్టీ మారిన వారిగా చూపే ప్రయత్నం జరుగుతోందని, ఇది కావాలనే చేస్తున్న జాప్యమని సదరు ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఈ జాప్యానికి నిరసనగానే ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని వారు నిర్ణయించుకున్నట్లు వినికిడి.
సరిపడా సంఖ్యాబలంతో వ్యూహరచన
మండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే తగిన సంఖ్యాబలం అవసరం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ) అధికారంలో ఉండటం, వైసీపీ నుంచి వచ్చిన సభ్యులు తోడవడంతో.. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ తమకు ఉందని రాజీనామా ఎమ్మెల్సీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే, వెనక్కి తగ్గకుండా ఛైర్మన్ తీరును సభలోనే నిలదీయాలని వారు భావిస్తున్నారు.
రాజకీయ కోణంలో చెక్‌మేట్
వైసీపీ నుంచి గెలిచిన ఈ ఐదుగురు సభ్యులు ఇప్పుడు టీడీపీ పక్షాన నిలబడటంతో మండలిలో బలాబలాలు తారుమారయ్యాయి. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తే, అది మండలిలో పెద్ద చర్చకు దారితీయడమే కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదిక కానుంది. ఛైర్మన్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి రాజీనామాలను పెండింగ్‌లో పెట్టడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ ఎమ్మెల్సీలు అభివర్ణిస్తున్నారు. ఈ ఐదుగురు సభ్యుల రివర్స్ అటాక్ ఏ మలుపు తిరుగుతుందో, మండలిలో సభాపతి పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
Read More
Next Story