’పిలవరా పేరు కమ్మరావతి అని‘
x

’పిలవరా పేరు కమ్మరావతి అని‘

తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి అమరావతి అంశంపై రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


రాజధాని అమరావతి చుట్టూ గత ఐదేళ్లుగా అల్లుకున్న కుల రాజకీయాలకు, సామాజిక ముద్రలకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తనదైన శైలిలో చురకలంటించారు. గురువారం రాజ్యసభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె నిప్పులు చెరుగుతూ.. 'పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా కమ్మరావతి!' అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్లమెంటును ఉలిక్కిపడేలా చేశాయి. రాజధానిని ఒక వర్గానికి పరిమితం చేస్తూ సాగుతున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టడమే కాకుండా, విభజన జరిగి దశాబ్దం దాటినా ఏపీకి దక్కాల్సిన హక్కులపై కేంద్రం చూపుతున్న వివక్షను ఆమె సంచలన రీతిలో కడిగిపారేశారు. రాజధాని ఏర్పాటులో దశాబ్ద కాలం జాప్యం చేస్తూ, విభజన హామీలను గాలికొదిలేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే, పేరు చుట్టూ సాగుతున్న ప్రహసనాన్ని ఆమె సంచలన రీతిలో ప్రశ్నించారు.

ఇది కేవలం కాస్మెటిక్ టచ్ మాత్రమే
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన అమరావతి చట్టబద్ధత బిల్లు కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (పైపై మెరుగులు) మాత్రమేనని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఇప్పుడు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయడంపై ఆమె నిప్పులు చెరిగారు. దశాబ్దం కాలం పాటు ఏపీ ప్రజలను అయోమయంలో నెట్టేసి, ఇప్పుడు చట్టబద్ధత అని నాటకాలు ఆడితే మేము మెచ్చుకోవాలా? లేక కృతజ్ఞతలు చెప్పాలా? ఇది ముమ్మాటికీ జాతీయ అవమానం అని ఆమె మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఇటుక పడకుండా, కేవలం కాగితాల మీద సంతకాలు పెడితే రాజధాని అయిపోదని, పదేళ్లుగా తెలుగు ప్రజలను వంచించడం కేంద్రం చేతకానితనం కాదా అని సూటిగా నిలదీశారు.
విభజన హామీలు..ఆస్తుల పంపిణీ ఏమైంది?
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన కీలక హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని రేణుక ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టులు దశాబ్దం దాటినా ఎందుకు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని ఆమె గర్జించారు. సుమారు రూ. 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఇంకా తేలకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తూ, దక్షిణాది రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం మీ వివక్షకు నిదర్శనం కాదా? అని కేంద్రాన్ని కడిగిపారేశారు. ఈ జాప్యానికి బాధ్యత వహిస్తూ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ ఐదు మండలాలు.. నో మ్యాన్స్ ల్యాండ్ లో బతుకులు
భద్రాచలం రామాలయానికి ఆస్తులు ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం మండలాల ప్రజల దీనస్థితిని ఆమె సభ దృష్టికి తెచ్చారు. ఆ ప్రాంత ప్రజలు ప్రస్తుతం నో మ్యాన్స్ ల్యాండ్ లో (దిక్కులేని వారుగా) బతుకుతున్నారని, అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. రాముడి ఆస్తులు ఉన్న ఆ ఐదు మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి అని ఆమె డిమాండ్ చేశారు. చివరగా, విభజన హామీల అమలుపై కేంద్రం వెంటనే స్టేటస్ పేపర్ విడుదల చేయాలని, ప్రతి హామీకి కాలపరిమితితో కూడిన రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు.
Read More
Next Story