మండలిలో మత  సెగ
x

మండలిలో మత సెగ

అచ్చెన్నాయుడు వర్సెస్ ఛైర్మన్.. సభ సాక్షిగా తీవ్ర దుమారం.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, మండలి ఛైర్మన్ మోషేను రాజు మధ్య మతపరమైన వ్యాఖ్యల యుద్ధం నడిచింది. ఛైర్మన్‌ను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి.

నన్ను అడగడానికి నువ్వు ఎవరు? .. ఛైర్మన్ ఆగ్రహం
చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మండలి ఛైర్మన్‌ను ఉద్దేశించి క్రిస్టియన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఛైర్మన్ మోషేను రాజు తీవ్రంగా స్పందించారు. నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు? అంటూ మంత్రిపై మండిపడ్డారు. తాను క్రిస్టియన్‌ను కాదని, హిందువునని ఆయన సభ సాక్షిగా స్పష్టం చేశారు. ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిని మతపరంగా విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దళితుడనే వివక్షా? బొమ్మి ఇజ్రాయెల్ ఫైర్
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఛైర్మన్ దళితుడనే కారణంతోనే ఆయనను అవమానించారు. బాబూ చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది? అని నిలదీశారు. మంత్రి లోకేష్ పక్కన ఉండగానే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారని, దీని వెనుక వారి ప్రోద్బలం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు తక్షణమే క్రిస్టియన్లకు, దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
డెయిరీలను కాపాడుకోవడానికే ఈ డ్రామా
తిరుమల లడ్డూపై చర్చకు తాము వారం రోజుల నుంచి కోరుతున్నా ప్రభుత్వం పారిపోతోందని బొమ్మి ఇజ్రాయెల్ విమర్శించారు. హెరిటేజ్, ఇందాపూర్ వంటి సొంత డెయిరీలను కాపాడుకోవడానికే మంత్రులు చర్చకు అడ్డుపడుతూ, ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. దేవుడే వీరికి బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
Read More
Next Story