
కేరళలో రహస్య రాజకీయాలు?
బీజేపీ-ఎల్‌డీఎఫ్ కుమ్మక్కయ్యిందని ఆరోపించిన రాహుల్ గాంధీ
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శబరిమల వివాదంపై మోదీ మౌనం వహించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆయన ఆరోపించారు. పతనంతిట్ట జిల్లా అడూర్‌లో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగించారు. కేరళలో బీజేపీ, ఎల్‌డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేరళలోని ఎల్‌డీఎఫ్ నాయకులపై ఎలాంటి ఒత్తిడి లేదని విమర్శించారు. తమపై అనేక కేసులు నమోదు చేసి, గంటల తరబడి విచారణ చేసినప్పటికీ, ఎల్‌డీఎఫ్ నాయకత్వంపై అలాంటి చర్యలు కనిపించడం లేదని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ప్రధాన సవాలుగా భావిస్తోందని, అందుకే యూడీఎఫ్‌ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
పాలక్కాడ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన తరచుగా మతం, దేవాలయాల గురించి మాట్లాడుతారని, కానీ శబరిమల అంశంపై మాత్రం మౌనం వహించారని విమర్శించారు. అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించకపోవడం, బీజేపీ-ఎల్‌డీఎఫ్ మధ్య అవగాహన ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని అన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే మతపరమైన అంశాలను ప్రస్తావించడం మోదీ రాజకీయ ధోరణి అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్లు లభించే అవకాశం ఉన్నప్పుడే దేవాలయాల గురించి మాట్లాడతారని, లేదంటే మౌనం పాటిస్తారని అన్నారు.
యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత శబరిమల ఆలయానికి సంబంధించిన అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

