
లోక్‌సభలో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య ఘర్షణ..
జాతీయ భద్రత అంశంపై మాట్లాడటానికి అవకాశం నిరాకరించడంపై లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్షనేత రాహుల్..
చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకంలోని కొన్ని అంశాలపై లోక్‌సభలో రాజకీయ దుమారం రేగింది. 2020 భారత్–చైనా మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినపుడు, ప్రధాని మోదీ తన బాధ్యత నుంచి తప్పుకున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకం లేదని స్పీకర్, ప్రభుత్వం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెబుతున్నారు. కానీ ఇది ఉందన్న విషయాన్ని దేశ యువత తెలుసుకోవాలి” అని రాహుల్ అన్నారు. లడఖ్‌లో జరిగిన పరిణామాలపై నరవణే పూర్తి వివరణ ఇచ్చారని, దానిని సభలో ప్రస్తావించేందుకు అనుమతించలేదని పేర్కొన్నారు.
చైనా యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులోకి వచ్చినప్పుడు అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సంప్రదించినపుడు, ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని తన పుస్తకంలో రాసుకొచ్చారు. “పై నుంచి ఆదేశాలు లేకుండా కాల్పులు జరపవద్దన్న స్టాండింగ్ ఆర్డర్ ఉందని నరవణే రాశారు” అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ “జో ఉచిత్ సంఝో వో కరో” అని చెప్పడం ద్వారా బాధ్యతను సైన్యంపై నెట్టేశారని రాహుల్ విమర్శించారు.
ఈ అంశంపై సభలో ప్రస్తావనకు అనుమతి నిరాకరించడంపై ప్రతిపక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం లోక్‌సభలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు, సీపీఐ(ఎం)కు చెందిన ఒక ఎంపీతో సహా మొత్తం ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. వీరంతా సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కే ప్రయత్నం చేయడం, కాగితాలు చించి చైర్ వైపు విసిరేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
జాతీయ భద్రత అంశంపై మాట్లాడటానికి అవకాశం నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని కూడా అందులో పేర్కొన్నారు. ఈ వివాదం ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.

