
బీజేపీ–ఎల్‌డీఎఫ్ మధ్య ‘రహస్య పొత్తు’?
కేరళలో రాహుల్ సంచలన ఆరోపణలు
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోన్న వేళ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ కూటమి గెలవాలని మోదీ కోరుకుంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. కేరళ రాజకీయాల్లో బీజేపీ, వామపక్షాల మధ్య ఒక “గందరగోళ భాగస్వామ్యం” ఉందని ఆరోపించారు. అయితే ప్రజల అసలైన గొంతుకగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రమే నిలుస్తోందన్నారు.
ఈ సందర్భంగా యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరు మాజీ సీపీఐ(ఎం) నాయకులు వి. కుంజికృష్ణన్, టి.కె. గోవిందన్ వేదికపై ఉండటం గురించి ప్రస్తావిస్తూ.. సీపీఐ(ఎం)లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
కేరళ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య పోరుగా మారాయని అన్నారు. ఒకవైపు సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ఉండగా, మరోవైపు యూడీఎఫ్ ఉందని చెప్పారు. అయితే ఈసారి బీజేపీ, వామపక్షాల మధ్య అప్రకటిత పొత్తు కనిపిస్తోందని ఆరోపించారు.
సాధారణంగా వామపక్ష పార్టీలు, రైట్‌వింగ్ పార్టీలకు విరుద్ధంగా ఉంటాయని, అయితే ఈ రెండు వర్గాలు కలిసిపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. “ఒక వామపక్ష పార్టీ, ఒక మితవాద లేదా రైట్‌వింగ్ పార్టీతో ఎలా కలిసి పని చేస్తుంది? ఇది ఒక చిక్కుముడి,” అని అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం వేదికపైనే కనిపిస్తోందని చెప్పారు. సీపీఐ(ఎం)కి చెందిన సీనియర్ నాయకులు తమ పార్టీకి ప్రచారం చేయకుండా యూడీఎఫ్ వేదికపై ఉండటం, ఆ పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు.
‘రియల్ లెప్టిస్టులు కాదు..’
ఇక ప్రస్తుతం ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ నిజమైన వామపక్ష కూటమి కాదని కూడా రాహుల్ ఆరోపించారు. అది కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, అందుకే బీజేపీతో జతకడుతోందని విమర్శించారు. వామపక్ష భావజాలం ఉన్నవారు ఇప్పుడు కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
‘శబరిమల ఊసే ఎత్తరు..’
కేరళలో బీజేపీ వైఖరిని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో మతం, దేవాలయాల గురించి మాట్లాడే మోదీ, కేరళలో మాత్రం శబరిమల అంశాన్ని ప్రస్తావించరని అన్నారు. శబరిమలలో బంగారం నష్టం విషయంలో సీపీఐ(ఎం) నాయకులపై ఆరోపణలు ఉన్నప్పటికీ, బీజేపీ ఈ అంశంపై మౌనం పాటిస్తోందని విమర్శించారు.
“హిందూ మత పరిరక్షకుడినని చెప్పుకునే ప్రధానమంత్రి, కేరళకు వచ్చినప్పుడు శబరిమల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన ఎల్‌డీఎఫ్ గెలవాలని కోరుకుంటున్నారు,” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మొత్తంగా, కేరళ రాజకీయాల్లో బీజేపీ, వామపక్షాల మధ్య రహస్య అవగాహన ఉందని, దీనికి వ్యతిరేకంగా యూడీఎఫ్ మాత్రమే ప్రజల పక్షాన నిలుస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

