
ప్రధానిపై కాంగ్రెస్ విమర్శలు..
కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పబట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ..
గాల్వాన్ ఘర్షణకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రాసిన పుస్తకం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) వేర్వేరుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.
పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేస్తూ “జో ఉచిత్ సంఝో వహీ కరో” (మీకు సరైనదనిపిస్తే అదే చేయండి) అని వ్యాఖ్యానించారు. రోజంతా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టి, ఇదే నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు “ట్రాప్ డీల్” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోదీపై ఘాటుగా స్పందించారు. నరవాణే జ్ఞాపకాల విషయంపై ప్రధాని స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని, ప్రశ్నలకు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదని ఆరోపించారు. సభ ప్రజాస్వామ్య విధానంలో సజావుగా నడవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని విమర్శించారు.
ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ..“అబద్ధాలను పదే పదే పునరావృతం చేయడం ప్రధానమంత్రి ముఖ్య విధిగా మారింది” అని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని సమాధానం ఇస్తూ ముఖ్యమైన అంశాలపై స్పందించలేదని తెలిపారు. గత దశాబ్దాల చరిత్ర గురించే మాట్లాడారని విమర్శించారు.
నరవాణే జ్ఞాపకాల పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ పుస్తకం ఉన్నదనే విషయం స్పష్టమని ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని ప్రస్తావించగానే పాలకపక్షం అసహనం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.
“ముందుగా నిజం వినాలి, తర్వాత సమాధానం చెప్పాలి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానమంత్రికి లేదు” అని ఖర్గే వ్యాఖ్యానించారు. సిక్కులను అవమానించామని మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిక్కులను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను కూడా ఖర్గే తప్పుబట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన ప్రభుత్వ రంగాన్ని బలపరచాల్సింది పోయి బలహీనపరిచారని ఆరోపించారు. దేశాన్ని నడిపించే స్పష్టమైన దార్శనికత ప్రధానికి లేదని విమర్శించారు.
మొత్తంగా గాల్వాన్ ఘర్షణ, నరవాణే జ్ఞాపకాల అంశం పార్లమెంట్‌లో రాజకీయ వాగ్వాదానికి దారితీస్తూ, అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.

