AAPలో అంతర్గత కలహాలు: రాఘవ్ చద్దా ‘డిజిటల్ రీసెట్’పై వివాదం
x

AAPలో అంతర్గత కలహాలు: రాఘవ్ చద్దా ‘డిజిటల్ రీసెట్’పై వివాదం

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీ వ్యతిరేక పోస్టులు తొలగించారన్న ఆరోపణలతో పార్టీలో ముదిరిన విభేదాలు..


Click the Play button to hear this message in audio format

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తీసుకున్న తాజా చర్య రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ప్రధాని మోదీ, బీజేపీపై గతంలో చేసిన విమర్శాత్మక పోస్టులను చద్దా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన సహచరుడు, ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ బహిర్గతం చేశారు. ఒకప్పుడు మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చద్దా, ఇప్పుడు తన పాత పోస్టులను తొలగించి, కొత్తగా సాఫ్ట్ ఇమేజ్‌ను రూపొందించుకున్నారని అన్నారు. చద్దా ఖాతాలో ఇప్పుడు విమర్శలు లేకుండా, ప్రధానిని ప్రశంసించే పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ చర్యను “డిజిటల్ రీసెట్”గా అభివర్ణిస్తూ, ఇది సాధారణ మార్పు కాదని, ఒక ప్రణాళికబద్ధమైన ప్రయత్నమని భరద్వాజ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్క్రీన్‌షాట్లు కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉండగా పార్టీ లోపల చద్దాపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన పార్లమెంట్‌లో “సాఫ్ట్ పీఆర్” అంశాలపై మాత్రమే మాట్లాడుతున్నారని, బీజేపీపై నేరుగా విమర్శలు చేయడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అతిశీ, అనురాగ్ దంద వంటి నేతలు కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

అలాగే రాజ్యసభలో కీలక బాధ్యతల మార్పులు జరిగిన తర్వాత చద్దా పాత్ర తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మాట్లాడే అవకాశాలు కూడా తగ్గించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ ఆరోపణలపై స్పందించిన చద్దా, తనపై సమన్వయంతో దాడి జరుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలపైనే తాను దృష్టి సారిస్తున్నానని, రాజకీయంగా ఆరోపణలు చేయడం తన లక్ష్యం కాదని స్పష్టం చేశారు.

ఒక వీడియో సందేశంలో తనను “గాయపడిన పులి”గా అభివర్ణించిన చద్దా, ప్రతిపక్షాలు వాకౌట్ చేసినా తాను సభలోనే ఉంటానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని చెప్పారు.

ఇక ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం విషయంలో తనను లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అన్ని ఎంపీలు సంతకం చేయనప్పుడు తనపై మాత్రమే ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.

పంజాబ్ సమస్యలను తాను లేవనెత్తలేదన్న విమర్శలపై కూడా చద్దా స్పందిస్తూ, తాను చేసిన పనులను చూపించే వీడియో విడుదల చేశారు. “ఇది కేవలం ట్రైలర్ మాత్రమే” అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సమయంలో చద్దా విదేశాల్లో ఉండటం కూడా వివాదానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత పార్టీలో విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆప్‌లో మాటల యుద్ధం కొనసాగుతుండగా, చద్దా తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story