పుదుచ్చేరిలో 91.23% ఓటింగ్
1964 తర్వాత అత్యధిక పోలింగ్..
2026 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. అత్యధికంగా ఓటింగ్ శాతం 91.23గా నమోదైంది. 1964 తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడినప్పటి నుంచి ఇదే రికార్డు స్థాయి పోలింగ్‌గా నిలిచింది.
పుదుచ్చేరి భౌగోళికంగా చిన్నదైనా, దాని నాలుగు ప్రాంతాలు మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ప్రధాన పుదుచ్చేరి ప్రాంతం పట్టణ, శివారు ప్రాంతాలతో ఉండగా, కారైకల్ తమిళనాడులో, యానాం ఆంధ్రప్రదేశ్‌లో, మాహే కేరళలో ఉన్నాయి.
జిల్లాల వారీగా ఓటింగ్..
పుదుచ్చేరి జిల్లాలోని 23 నియోజకవర్గాల్లో ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. చాలా చోట్ల 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
అత్యధికం: ఒస్సుడు – 94.39%
అత్యల్పం: తట్టంచవాడి – 87.10%
ఇది పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు చురుకుగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చూపుతోంది.
కారైకల్‌లో తక్కువగా..
కారైకల్ జిల్లాలో పోలింగ్ శాతం కొద్దిగా తక్కువగా నమోదైంది.
కారైకల్ నార్త్ – 85.93%
కారైకల్ సౌత్ – 83.46% (అత్యల్పం)
నెడుంగాడు – 88.33%
నెరవి–టీఆర్ పట్టినం – 87.61%
తిరునల్లార్ – 88.48% (అత్యధికం)
ఈ ప్రాంతంలో ఓటర్ల ఉత్సాహం తక్కువగా కనిపించింది.
మాహేలో అత్యల్ప ఓటింగ్..
మాహే నియోజకవర్గంలో కేవలం 77.41 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది మొత్తం పుదుచ్చేరిలోనే అత్యల్పం.
దీనికి ప్రధాన కారణం.ఇక్కడి ప్రజల్లో చాలా మంది గల్ఫ్ దేశాల్లో పనిచేయడం వల్ల ఎన్నికలకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
యానాంలో భారీ స్పందన..
ఆంధ్రప్రదేశ్‌లోని యానాంలో మాత్రం సుమారు 93 శాతం ఓటింగ్ నమోదైంది. చిన్న ప్రాంతమైనప్పటికీ, ఓటర్ల పాల్గొనడం గణనీయంగా ఉంది.
ఓటింగ్ పెరగడానికి కారణాలు..
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR)లో సుమారు 1,03,467 మంది పేర్లు జాబితా నుంచి తొలగింపు, మిగిలిన ఓటర్లలో చైతన్యం పెరగడం..ఈ అంశాలు కలిసి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకుల చెబుతున్నారు.
చరిత్రలో కొత్త మైలురాయి..
1954లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన పుదుచ్చేరి, 1964లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది. అప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 2026 ఎన్నికలు అత్యధిక ఓటింగ్‌తో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ ఎన్నికలు పుదుచ్చేరిలో ప్రజాస్వామ్యంపై విశ్వాసం, ఓటర్ల చైతన్యం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తున్నాయి.



