
తిరువూరులో బహిరంగ చర్చ హైడ్రామా
బోసు బొమ్మ సెంటర్ వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వేదికగా సాగుతున్న పొలిటికల్ వార్ పరాకాష్టకు చేరింది. అభివృద్ధిపై సవాళ్లు.. ప్రతిసవాళ్ల మధ్య ఇరు పార్టీల నేతలు ఒకే చోట బహిరంగ చర్చకు సిద్ధమవడంతో నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు రంగంలోకి దిగి నేతలను అదుపులోకి తీసుకోవడంతో పాటు మండల వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు.
ఏం జరిగింది?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరులో జరిగిన అభివృద్ధిపై గత రెండు రోజులుగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధిపై చర్చించేందుకు తిరువూరు పట్టణంలోని ప్రసిద్ధ బోసు బొమ్మ సెంటర్ వద్దకు రావాలని ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. శుక్రవారం ఇరు పార్టీల కీలక నేతలు భారీ కేడర్‌తో చర్చా వేదిక వైపు బయలుదేరడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది.
పోలీసుల ఎంట్రీ - నేతల అరెస్ట్
పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేశారు. చర్చకు సిద్ధమైన కీలక నేతలను మార్గమధ్యలోనే అడ్డుకుని, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. స్థానిక తహశీల్దార్ ఆదేశాల మేరకు తిరువూరు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.
అధికారుల హెచ్చరిక
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాము. నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు లేదా సభలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు స్పష్టం చేశారు. అటు తహశీల్దార్ ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతోనే ఈ ఆంక్షలు అనివార్యమయ్యాయని అధికారులు వెల్లడించారు.
Next Story

