
అస్సాంలో రెండు రోజుల పాటు ప్రియాంక ..
పర్యటనకు కారణమేంటి? కాంగ్రెస్‌తో జతకడుతున్న పార్టీలేంటి?
అస్సాంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిన కొద్ది రోజులకే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గౌహతికి చేరుకుని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ ఓరా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరుతున్నానని ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక రెండు రోజుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫిబ్రవరి 16న పార్టీకి రాజీనామా చేసిన బోరా.. ఈ నెల 22న బీజేపీలో చేరతానని వెల్లడించారు. పార్టీ అంతర్గత అవమానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ధుబ్రి ఎంపీ రకీబుల్ హుస్సేన్ జోక్యం పార్టీలో పెరిగిపోయిందని, ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ కేవలం డమ్మిగా మారారని కూడా విమర్శించారు. ఇటు బోరా బీజేపీ చేరిక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు.
ప్రియాంకకు ఘన స్వాగతం..
ఢిల్లీ నుంచి గౌహతికి చేరుకున్న ప్రియాంకకు విమానాశ్రయం వెలుపల ఘన స్వాగతం లభించింది. తెల్లవారుజామునుంచే వందలాది మంది కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని పార్టీ నినాదాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తుల్లో వారంతా విచ్చేశారు.
ఆలయంలో పూజలు..
గౌహతికి చేరుకున్న ప్రియాంక తొలుత గౌరవ్ గొగోయ్‌తో కలిసి కామఖ్యే ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మనబేంద్ర శర్మ కాంప్లెక్స్‌లో బీజేపీ ప్రభుత్వంపై “పీపుల్స్ ఛార్జ్‌షీట్”ను విడుదల చేశారు. 20 అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. సిండికేట్ రాజ్ కొనసాగింపు, భూకుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం పెరుగుదల, ప్రభుత్వ నియామకాలలో ఆలస్యం/అసమానత, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, ధరల పెరుగుదల నియంత్రణలో వైఫల్యం, రైతు సమస్యలు, విద్యారంగం నిర్లక్ష్యం, ఆరోగ్య రంగ లోపాలు, మహిళా భద్రత సమస్యలు, మైనారిటీల పట్ల వివక్ష ఆరోపణలు, పరిశ్రమల పెట్టుబడులు తగ్గుదల, పర్యావరణ అంశాల్లో నిర్లక్ష్యం, వరద నిర్వహణలో వైఫల్యం, స్థానిక స్వయంప్రతిపత్తి సంస్థల బలహీనత, ఎన్‌ఆర్‌సీ/పౌరసత్వ అంశాల్లో గందరగోళం, అభివృద్ధి పనుల్లో ప్రకటనలే ఎక్కువ అన్న విమర్శ, చట్టవ్యవస్థపై ప్రశ్నలు, ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయని నివేదికలో రాసుకొచ్చారు.
అనంతరం రాజీవ్ భవన్‌లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యారు. బూత్ స్థాయి నిర్వహణ, అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించారు. గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని ఆమె కార్యకర్తలకు సూచించారు.
న్యూఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు ఆమె గాయని జుబెన్ గార్గ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సెప్టెంబర్ 19, 2025న సింగపూర్‌లో గార్గ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌తో పొత్తు..
బీజేపీ మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. ఏడు విడతల చర్చలు జరిగాయని, 15 స్థానాలపై దృష్టి పెట్టామని యూపీపీఎల్ నాయకులు వెల్లడించారు. మరోవైపు అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ), రైజోర్ దళ్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. సీట్ల పంపకాలపై త్వరలో స్పష్టత రానుంది.
మొత్తంగా చూస్తే ప్రియాంక పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అయితే ఇదే ఊపు ఎన్నికల్లో ఫలితాల్లో ప్రతిబింబిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

