లోకేశ్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ
x

లోకేశ్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

నారా లోకేశ్ నేతృత్వంలోని ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.


అమరావతి రాజధానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా నారా లోకేశ్‌ను అభినందిస్తూ కంగ్రాట్స్ అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారమవుతున్న తరుణంలో ప్రధాని ఇచ్చిన ఈ అభినందనలు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.


ప్రధానికి కృతజ్ఞతలు.. ఘన సత్కారం

లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026 కు పూర్తి మెజారిటీతో ఆమోదం లభించేలా చొరవ తీసుకున్నందుకు మంత్రి లోకేశ్ ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీని శాలువాతో లోకేశ్ ఘనంగా సత్కరించారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని లోకేశ్ ఈ సందర్భంగా ప్రధానితో పేర్కొన్నారు.
స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు
ప్రధానితో భేటీ అనంతరం లోకేశ్, ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసింది. సభలో బిల్లు చర్చకు రావడానికి, ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత లభించడం అనేది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, ఇది వేల మంది రైతుల త్యాగాలకు, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని లోకేశ్ స్పష్టం చేశారు.

అమరావతికి తిరుగులేని చట్టబద్ధత
పార్లమెంటు సాక్షిగా బిల్లు ఆమోదం పొందడంతో అమరావతికి ఇకపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు చేసిన ప్రయత్నాలను ఈ బిల్లు శాశ్వతంగా అడ్డుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే పనులు జెట్ స్పీడ్‌తో సాగుతాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More
Next Story