’చెప్పులు..బూట్లు‘ చుట్టూ రాజకీయాలు
x

’చెప్పులు..బూట్లు‘ చుట్టూ రాజకీయాలు

ప్రజా సమస్యలకు వేదిక కావలసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆ లక్ష్యాన్ని విస్మరించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సభా మర్యాదలు పక్కకు వెళ్లాయి.. ప్రజా సమస్యలు అటకెక్కాయి.. చివరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదికగా రాజకీయాలన్నీ ’చెప్పులు, బూట్ల‘ చుట్టూ తిరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం, నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ జరగాల్సిన సభలో.. దేవుడి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకున్నారనే ’మహాపచారం‘ అస్త్రంతో అధికార కూటమి విరుచుకుపడగా, గతంలో చంద్రబాబు బూట్లు వేసుకుని చేసిన పూజల ఫోటోలతో ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. భక్తికి, రాజకీయానికి మధ్య జరిగిన ఈ హైడ్రామాలో అసలు లడ్డూ కల్తీ నిజాలు వెలుగు చూస్తాయా లేక ఈ ’చెప్పుల యుద్ధం‘తోనే కాలక్షేపం జరుగుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, భక్తులు విస్తుపోతున్నారు. అంతేకాకుండా తిరుమల లడ్డూ ప్రసాదం, నెయ్యి కల్తీ వ్యవహారం సభను కుదిపేస్తుండగా.. అనూహ్యంగా ఈ వివాదం ’చెప్పులు, బూట్ల‘ చుట్టూ తిరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దేవుడి ఫోటోలు.. చెప్పుల వివాదం
సభలో నెయ్యి కల్తీ అంశంపై నిరసన తెలుపుతూ వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని పోడియం వద్దకు దూసుకెళ్లారు. అయితే, వారు కాళ్లకు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలను పట్టుకోవడంపై మంత్రులు నిప్పులు చెరిగారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకోవడం హిందూ మతాన్ని అవమానించడమే.. ఇది అక్షరాలా మహాపచారం అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకోవాలని కూటమి మంత్రులు లోకేశ్, అనిత, గొట్టిపాటి రవి డిమాండ్ చేయడంతో సభలో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది.
నెయ్యి రాజకీయం
మరోవైపు, నెయ్యి కల్తీ వివాదం సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార సంస్థ చుట్టూ కూడా తిరిగింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి, చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార సంస్థకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని వైసీపీ సభ్యుడు, మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ఒక పద్ధతి ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. దీనికి కూటమి సర్కార్ కౌంటర్ ఇస్తూ.. గత ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన వారు ఇప్పుడు ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉందని అధికార పక్షం కొట్టిపారేసింది.
గందరగోళంలో మండలి..
తిరుమల పవిత్రతను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని కూటమి ఆరోపిస్తుంటే, తమపై బురద చల్లడానికే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ వాదిస్తోంది. ఈ క్రమంలో సభలో దేవుడి ఫోటోలను ప్రదర్శించిన తీరు, దానికి ప్రతిగా మంత్రుల ఆగ్రహం వెరసి .. మండలి చర్చలు కాస్తా వ్యక్తిగత దూషణలు, మతపరమైన ఆరోపణల దిశగా సాగాయి. చివరకు ఈ ’చెప్పులు..బూట్లు..దేవుడి ఫోటోల‘ గొడవ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. భక్తిని రాజకీయాలకు ఆయుధంగా వాడుకుంటున్నారన్న విమర్శలు ఇరుపక్షాలపైనా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు బూట్లపై బొత్స విమర్శల వర్షం
వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు పట్టుకున్నప్పుడు చెప్పులు వేసుకున్నారన్న కూటమి విమర్శలను బొత్స సత్యనారాయణ తీవ్రంగా తిప్పికొట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బూట్లు వేసుకుని దేవుడి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. నీతులు చెప్పే ముందు గతాన్ని ఒక్కసారి చూసుకోవాలి అంటూ చంద్రబాబు పాత ఫోటోలను ప్రస్తావిస్తూ బొత్స సభలో నిలదీశారు.
అక్కడ లేని ఆచారం.. ఇక్కడెందుకు
గతంలో పుష్కరాల సమయంలో, ఇతర పుణ్యక్షేత్రాల పర్యటనల్లో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు లేని అపచారం ఇప్పుడు ఎలా వచ్చిందని బొత్స ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి మంత్రులు చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై బురద చల్లేందుకే ఈ చెప్పుల రాజకీయం మొదలుపెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయ రణరంగంలో నమ్మకం బలి కావాలా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సాగుతున్న ఈ చెప్పులు..బూట్లు..నెయ్యి‘ రాజకీయాలపై సామాన్య ప్రజలు, ముఖ్యంగా భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యున్నత వేదికలు.. వ్యక్తిగత దూషణలకు, పరస్పర ఆరోపణలకు వేదికలుగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిజమైన విచారణే భక్తులకు కావాలి
చంద్రబాబు గతంలో బూట్లు వేశారని వైసీపీ, ఇప్పుడు వైసీపీ సభ్యులు అపచారం చేశారని కూటమి చేస్తున్న వాదనల మధ్య.. అసలు కల్తీ జరిగిందా? జరిగితే బాధ్యులెవరు? అనే ప్రాథమిక ప్రశ్నలు పక్కకు వెళ్లిపోతున్నాయి. సామాన్య ప్రజలు కోరుకునేది కేవలం విమర్శలు కాదు, పారదర్శకమైన విచారణ, పవిత్రత పునరుద్ధరణ మాత్రమే. రాజకీయ పంతాల కోసం దైవత్వాన్ని, మతపరమైన ఆచారాలను వివాదాల్లోకి లాగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story