ఒకే ఫ్రేమ్‌లో పొలిటికల్ అండ్ సినీ గ్లామర్
x
వివాహ వేడుకల్లో తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్ తో జగన్

ఒకే ఫ్రేమ్‌లో పొలిటికల్ అండ్ సినీ గ్లామర్

చెన్నై వేదికగా ’జగన్‘ మార్క్ పాలిటిక్స్.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన జగన్ చెన్నై పర్యటన.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెయ్యి కల్తీ, వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై టీడీపీ శ్రేణుల దాడులు, అంబటి రాంబాబు అరెస్టు వంటి పలు సంఘటనలతో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. అటు అమరావతి, ఇటు రాజమండ్రి సెగలతో ఊగిపోతుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం చెన్నై వేదికగా సరికొత్త సమీకరణాలకు తెరలేపారు. కేవలం తన బాబాయ్ కుమారుడి వివాహ వేడుక కోసమే వెళ్లినట్లు కనిపిస్తున్నా, అక్కడ దక్షిణాది పాలిటిక్స్‌ను శాసించే హేమాహేమీలతో ఆయన జరిపిన భేటీలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసలైన హాట్ టాపిక్‌.


తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి మాస్ లీడర్, ప్రముఖ నటుడు విజయ్ వరకు, సూర్య నుంచి కార్తీ వరకు.. రాజకీయ, సినీ గ్లామర్ అంతా జగన్ చుట్టూ చేరిన తీరు చూస్తుంటే, ఇది కేవలం పెళ్లి వేడుక మాత్రమేనా లేక ఇండియా కూటమి నీడలో భవిష్యత్తు రాజకీయం ఏదైనా రూపుదిద్దుకుంటోందా? అన్న సందేహం రాజకీయ విశ్లేషకులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


కుటుంబ వేడుకలో తారల తళతళలు..

తన పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ - వేదికల వివాహ వేడుకకు జగన్ దంపతులు హాజరయ్యారు. చెన్నైలోని ప్రతిష్టాత్మక ది లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వేడుకలో జగన్ స్కూల్ ఫ్రెండ్స్, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు ఆయన్ని కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్‌ను చూడగానే సూర్య ఆత్మీయంగా హత్తుకోవడం, వారి మధ్య సాగిన స్నేహపూర్వక సంభాషణకు సంబంధించిన వీడియోలు ఫ్రెండ్స్ రీయూనియన్ అంటూ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.


అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఒకే వేదికపై ఇండియా కూటమి నేతలు.. పొలిటికల్ హీట్

ఇది కుటుంబ వేడుక అయినప్పటికీ, అక్కడ జరిగిన రాజకీయ నేతల కలయిక ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్వయంగా విచ్చేసి జగన్‌ను ఆత్మీయంగా పలకరించారు. వీరందరూ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమిలో కీలకంగా ఉండటంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వీరితో పాటు తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్ కూడా జగన్‌తో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించడం రెండు రాష్ట్రాల మాస్ లీడర్ల కలయికగా ట్రెండ్ అవుతోంది.


ఆత్మీయ ఆలింగనం.. కేవీపీ, చిదంబరంతో జగన్ భేటీ

వైఎస్సార్ ప్రాణ స్నేహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు జగన్‌ను ఆలింగనం చేసుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారు కాసేపు ఏకాంతంగా చర్చించుకోవడం గమనార్హం. అలాగే కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కూడా ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఏపీలో కాంగ్రెస్ - వైసీపీ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, చెన్నై వేదికగా జరిగిన ఈ భేటీలు భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతమా? అనే చర్చకు దారితీశాయి.


ఓ వైపు ఏపీలో అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న వేళ, చెన్నైలో జగన్ చుట్టూ ఉన్న ఈ ప్రముఖుల కోలాహలం ఆయనకున్న జాతీయ స్థాయి సంబంధాలను మరోసారి గుర్తుచేసింది. ఇన్ని పార్టీల నేతలు, సినీ స్టార్లు ఒకే వేదికపై జగన్‌తో కనిపించడం కేవలం మర్యాదపూర్వకమేనా లేక దీని వెనుక ఏదైనా రాజకీయం ఉందా అన్నది మున్ముందు తేలనుందనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Read More
Next Story