‘భయంతోనే ప్రధాని మోదీ గైర్హాజరు’
x

‘భయంతోనే ప్రధాని మోదీ గైర్హాజరు’

స్పీకర్ వ్యాఖ్యలు “నిరాధారమైనవి, పరువు నష్టం కలిగించేవి”గా అభివర్ణించిన మహిళా ఎంపీలు..


Click the Play button to hear this message in audio format

లోక్‌సభ(Lok Sabha)లో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) గైర్హాజరయ్యారు. దీంతో మహిళా కాంగ్రెస్(Congress) ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా(Om Birla)కు లేఖ రాశారు. ఆ లేఖపై కరూర్ ఎంపీ ఎస్. జోతిమణి, ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోత్స్న చరణ్‌దాస్ మహంత్, ఆర్. సుధ, వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్ సహా ఆరుగురు ఎంపీలు సంతకం చేశారు.

‘ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే..’

ప్రభుత్వం ప్రతిపక్షాల పార్లమెంటరీ హక్కులను నిరాకరిస్తోందని ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే ప్రధాని సభకు రాలేదని పేర్కొన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను “తప్పుడు, నిరాధారమైనవి, పరువు నష్టం కలిగించేవి”గా అభివర్ణించారు.

కొన్ని రోజుల క్రితం, కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని సీటు వైపు వెళ్లి అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న ‘విశ్వసనీయ సమాచారం’ తనకు అందిందని స్పీకర్ చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ వచ్చింది. అయితే ఈ ఆరోపణలను మహిళా ఎంపీలు పూర్తిగా ఖండించారు.

గత 22 సంవత్సరాల్లో ధన్యవాద తీర్మాన చర్చకు ప్రధానమంత్రి స్పందించకపోవడం ఇదే తొలిసారి అని వారు గుర్తుచేశారు. అధికార పార్టీ ఒత్తిడితోనే స్పీకర్ వ్యవహరిస్తున్నారని, చైర్ నిష్పాక్షికంగా ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ప్రధాని “స్పీకర్ వెనుక దాక్కుంటున్నారు” అంటూ విమర్శించారు.

చర్చల సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం పలుమార్లు నిరాకరించారని, ఇది అపూర్వమని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇండియా బ్లాక్‌కు చెందిన ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌ను ప్రశ్నిస్తూ, ఒక బీజేపీ ఎంపీ చేసిన అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య బడ్జెట్ సమావేశాలు పలు మార్లు వాయిదా పడగా, ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్‌సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Read More
Next Story