
‘ఓట్ల కోసం మతతత్వాన్ని ప్రోత్సహించడం దేశానికి ప్రమాదకరం’
కాంగ్రెస్ నేత రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్‌పై ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ “బి-టీమ్”గా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. విజయన్ వారం రోజుల్లో ఇదే మాట అనడం ఇది రెండోసారి.
రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలపై చేసిన వ్యాఖ్యలను విజయన్ ఖండించారు. ఇతర ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకున్నప్పటికీ, తాను మాత్రం టార్గెట్ కాలేదని రాహుల్ చెప్పడం సరైనది కాదన్నారు. చూసిన విషయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోని వ్యక్తి రాహుల్ అని, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని వ్యంగ్యంగా అన్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసును ప్రస్తావిస్తూ.. గతంలో కాంగ్రెస్ నాయకత్వం చేసిన ఆరోపణలు తరువాత తప్పు అని తేలడంతో వారు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అయినా కూడా అదే విషయాలను మళ్లీ చెబుతున్నారని విమర్శించారు.
జాతీయ స్థాయిలో చూస్తే.. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేలా వ్యవహరిస్తోందని విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీజేపీ ఒకే విధంగా ఎల్‌డీఎఫ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్, యూడీఎఫ్ మతపరమైన వర్గాలతో రాజీ పడుతున్నాయని ఆరోపించారు. ఓట్ల కోసం మతతత్వాన్ని ప్రోత్సహించడం దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఎల్‌డీఎఫ్ మాత్రం ఎలాంటి మతతత్వానికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.
శబరిమల బంగారం నష్టం అంశంపై మాట్లాడుతూ.. ఈ కేసును కేరళ హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ఎలాంటి లోపాలు గుర్తించలేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల లాభం కోసం ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికలపై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపవని విజయన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

