పవన్ ’ధర్మ‘ గళం..లౌకికవాదుల్లో కలకలం
x

పవన్ ’ధర్మ‘ గళం..లౌకికవాదుల్లో కలకలం

సగటు హిందువులందరూ ఏకం కావాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


మౌనం వద్దు.. ఇక గొంతెత్తండి అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ యవనికపై కొత్త చర్చకు తెరలేపాయి. హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆయన ’ఎక్స్‘ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా హిందువుల్లో ఉన్న ఉదాసీనత మారాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు లౌకికవాదులు, ప్రజాస్వామ్య వాదులల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కర్మ సిద్ధాంతం నుంచి కర్తవ్యం వైపు

దేవుడిని అవమానిస్తే ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు అని మౌనంగా ఉండిపోయే సగటు హిందూ మనస్తత్వంపై పవన్ కల్యాణ్ విల్లు ఎక్కు పెట్టారు. వ్యక్తిగతంగా బాధపడటం కాదు, సామూహికంగా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మనం కులాలు, ప్రాంతాలు, భాషల పరంగా విడిపోయి ఉండవచ్చు.. కానీ ధర్మం ఒక్కటే, దేవుళ్లు ఒక్కరే అని పవన్ చేసిన వ్యాఖ్యలు హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసే దిశగా అడుగులని విశ్లేషకులు భావిస్తున్నారు.

లౌకికవాదుల ఆందోళన

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన లౌకికవాదానికి భిన్నంగా ఉన్నాయంటూ కొందరు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై పవన్ ముందే క్లారిటీ ఇచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు అని ఆయన స్పష్టం చేశారు. స్వధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం మన ఉనికిని చాటుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ధర్మ రక్షణ గురించి ఆయన ఇంత బహిరంగంగా మాట్లాడటం లౌకికవాద శిబిరాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

మౌనం బలహీనత కాకూడదు

దుర్బుద్ధితో మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మౌనంగా ఉండటం మన సామూహిక చైతన్యాన్ని బలహీనపరుస్తుందని పవన్ హెచ్చరించారు. కేవలం భక్తులుగానే కాకుండా, ధర్మాన్ని కాపాడే సంరక్షకులుగా ప్రతి ఒక్కరూ మారాలని ఆయన కోరారు. తిరుమల లడ్డూ వివాదం తర్వాత పవన్ కల్యాణ్ తన గళాన్ని మరింత పెంచడం, సనాతన ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడటం ఆయన రాజకీయ పంథాలో వచ్చిన పెను మార్పుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ట్వీట్ ఇప్పుడు ఒక సామాజిక చర్చగా మారింది. ఆయన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాయా? లేక లౌకికవాద రాజకీయాల్లో కొత్త వివాదాలకు కేంద్ర బిందువు అవుతాయా? అన్నది వేచి చూడాలి.

Read More
Next Story