
మంగళిగిరిలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్
జన సేనాని పవన్ ఆగ్రహిస్తే ఎలా?
మంగళగిరి ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడం లేదన్న అసంతృప్తితో పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తాకథనాలు విస్తృతంగా వచ్చాయి. మంగళవారం అన్ని పేపర్లు, ఛానళ్లు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి.
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత చురుగ్గా స్పందించాలని సూచించిన పవన్, సమావేశాన్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లడం ద్వారా పార్టీ శ్రేణుల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
“అన్నీ నేనే మాట్లాడాలా?” – నేతలపై అసంతృప్తి పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని పవన్ పార్టీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
“అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు?” అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలు వైసీపీ ‘ట్రాప్’లో చిక్కుకోకుండా విషయపరంగా మాత్రమే స్పందించాలని పవన్ సూచించినట్టు సమాచారం.
అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆగ్రహం
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందని పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ కమిటీని నియమించిన పార్టీ, నివేదిక ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పవన్ ఆదేశించినట్టు సమాచారం. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారని తెలుస్తోంది.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ అధినేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆయన కాపు సామాజికవర్గం నాయకుడు. పవన్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు.
ఈనేపథ్యంలో ప్రస్తుతం జనసేన ఎదుర్కొంటున్న సవాళ్లు సామాన్యమైనవి కావు. అంబటి రాంబాబు లాంటి కాపు నేతల అరెస్టులతో సొంత సామాజిక వర్గం నుంచి జనసేన పార్టీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అటు కుల బంధాన్ని తెంచుకోలేక, ఇటు కూటమి ధర్మాన్ని వీడలేక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు.
గత ప్రభుత్వ దాడులను నిరసించిన జనసేన, నేడు టిడిపి శ్రేణులు చేస్తున్న దాడులపై మౌనంగా ఉండటం 'ద్వంద్వ నీతి'గా కనిపిస్తోంది. దీన్ని ప్రశ్నిస్తే కూటమి దెబ్బతింటుంది, ప్రశ్నించకపోతే జనసేన అస్తిత్వం దెబ్బతింటుంది అని జనసేన నేతలు భయపడుతున్నారా అంటున్నారు ఇటీవలే జనసేన నుంచి వైసీపీకి మారిన ఓ యువనాయకుడు. (పేరు రాయడానికి ఆయన ఇష్టపడలేదు)
“నాయకత్వం అంటే దిశ చూపించడమే” ?
మంగళగిరి సమావేశంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. "అన్నీ నేనే చూసుకోవాలా?" అని ఆయన ప్రశ్నించడం వెనుక ఉన్న బాధ అర్థం చేసుకోదగినదే అయినా, ఒక వ్యవస్థను నిర్మించడంలో విఫలమయ్యామనే నిజాన్ని అది బయటపెడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడటం లేదంటే.. వారికి తగిన శిక్షణ ఇవ్వడంలో లేదా స్వేచ్ఛను ఇవ్వడంలో నాయకత్వం విఫలమైందనేది స్పష్టం అని సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ ది ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు. "యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు సైన్యాన్ని ఉత్తేజపరచాల్సింది పోయి, 'మీరేం చేయడం లేదు' అని నిందిస్తూ కమాండర్ యుద్ధ క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోతే, ఇక ఆ సైన్యం ఎవరి కోసం పోరాడుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు నాయకుడు పి. రమేష్ కూడా స్పందిస్తూ… “రాజకీయ పరిణితిని ప్రదర్శించాల్సిన సమయంలో సమావేశం నుంచి నిష్క్రమించడం పవన్ షార్ట్ టెంపర్‌ను మరోసారి చూపించిందన్న అభిప్రాయం ఉంది” అని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
“ఇది క్రమశిక్షణ హెచ్చరిక” – జనసేన వర్గాలు
అయితే జనసేన వర్గాలు మాత్రం ఈ ఘటనను వేరే కోణంలో చూస్తున్నాయి. పార్టీ నేతలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పవన్ ఇచ్చిన ‘క్రమశిక్షణ హెచ్చరిక’గా దీనిని భావించాలని వారు చెబుతున్నారు.
“పార్టీకి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే, మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. పవన్ ఆగ్రహం వ్యక్తిగతం కాదు, పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా మార్చాలన్న ప్రయత్నం” అని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.
ఇరకాటంలో జనసేన?
ప్రస్తుతం జనసేన రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగా మారుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల అరెస్టులు, కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, వైసీపీ నేతల ఇళ్లపై దాడుల ఘటనలు వంటి పరిణామాల మధ్య జనసేన స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టిడిపి భాగస్వామిగా ఉండి కూడా ప్రభుత్వ చర్యలపై స్పందించాల్సిన పరిస్థితి జనసేనకు సవాలుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పార్టీ నేతలు, క్యాడర్ మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశ ఘటన సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.
Next Story

