
ఒకే ఫ్రేమ్‌లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ
అసెంబ్లీలో సినీ-రాజకీయ సందడి..పాత వివాదాలకు తెరపడినట్లేనా?"
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా గురువారం ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్ కల్యాణ్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీలోని పవన్ కల్యాణ్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశం మర్యాదపూర్వకమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై చర్చలకు వేదికైంది.
నియోజకవర్గ సమస్యలే అజెండాగా..
హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ తన నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌తో బాలయ్య సుదీర్ఘంగా చర్చించారు. హిందూపురంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పెండింగ్‌లో ఉన్న పనులపై పవన్‌కు వివరించారు. ఇదే సమయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ను కలిసి తన నియోజకవర్గ అభివృద్ధిపై వినతిపత్రం అందజేశారు.
తమ్ముడి పేషీలో నాగబాబు.. ముగ్గురు నేతల కీలక చర్చ
ఈ సమావేశంలో మరో విశేషం ఏమిటంటే, పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కూడా అక్కడే ఉండటం. నాగబాబు, బాలయ్య, అశోక్ రెడ్డి కలిసి పవన్ కల్యాణ్‌తో అసెంబ్లీ పేషీలో భేటీ అయ్యారు. ఒకే ఫ్రేమ్‌లో నాగబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాత దుమారం.. కొత్త స్నేహం?
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడిచింది. అయితే, ఇప్పుడు స్వయంగా బాలయ్యే పవన్ చాంబర్‌కు రావడం, అక్కడ నాగబాబుతో కలిసి ఆత్మీయంగా చర్చలు జరపడం ద్వారా పాత వివాదాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. పొత్తు ధర్మం పాటిస్తూనే, వ్యక్తిగత విబేధాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి నడవాలనే సంకేతాలను ఈ భేటీ ఇచ్చింది.

