
కేబినెట్‌కు ఆరుగురు మంత్రుల డుమ్మా: మళ్లీ మొహం చాటేసిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ వరుస గైర్హాజరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు జరిగిన కీలక కేబినెట్ భేటీకి ఏకంగా ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుసగా రెండోసారి కేబినెట్ సమావేశానికి దూరం కావడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అభివృద్ధి, పరిపాలనపై కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రుల గైర్హాజరు వెనుక అసలు కారణాలేంటి? కూటమిలో ఏవైనా మనస్పర్థలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎవరెవరు గైర్హాజరయ్యారు?
శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పార్టీ నుండే నాదెండ్ల మనోహర్ కూడా హాజరు కాలేదు. వీరితో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎన్.ఎం.డి ఫరూక్ కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు. కీలకమైన కేబినెట్ సమావేశానికి ఇంతమంది మంత్రులు రాకపోవడం గతంలో ఎన్నడూ లేని పరిణామం కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
వరుస గైర్హాజరు: పవన్ వెనుక కారణమేంటి
పవన్ కల్యాణ్ బుధవారం, గురువారం రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సుకు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కేబినెట్ భేటీకి కూడా రాకపోవడంపై అధికారిక వర్గాలు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయి. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండటంతో, ఆ వేడుకల ఏర్పాట్ల కోసం పవన్ బిజీగా ఉన్నారని, అందుకే సమావేశానికి రాలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే, గత ఫిబ్రవరి సమావేశానికి కూడా ఆయన అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఇలా వరుసగా కీలక సమావేశాలకు దూరంగా ఉండటం పట్ల వివిధ రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మంత్రుల డుమ్మాపై ప్రభుత్వ వెర్షన్
గైర్హాజరైన మిగిలిన మంత్రులకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. హోం మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారని సమాచారం. ఇక మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తన కుటుంబంలోని వ్యక్తిగత కార్యక్రమం (భార్య సంవత్సరీకం) కారణంగా సెలవు తీసుకున్నట్లు తెలిసింది. వీరంతా ముందుగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించినప్పటికీ.. ఒకేసారి ఆరుగురు మంత్రులు లేకుండా కేబినెట్ సాగడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
కూటమిలో కలకలమా? లేక యాదృచ్ఛికమా?
కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్ దూరం కావడం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆతే అంశంపై సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అమరావతి ప్రాజెక్టుల పురోగతి, శాంతిభద్రతల వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్న వేళ, రాష్ట్రంలోని రెండో అత్యున్నత హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ లేకపోవడం ఒక లోటుగానే కనిపిస్తోంది. మరోవైపు, సీటు షేరింగ్ లేదా ప్రాధాన్యత విషయంలో ఏవైనా అసంతృప్తులు ఉన్నాయా అన్న కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. అయితే, తెలుగుదేశం - జనసేన వర్గాలు మాత్రం ఇది కేవలం పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన యాదృచ్ఛికం మాత్రమే అని కొట్టిపారేస్తున్నాయి.
కారణాలు ఏవైనా.. ఆరుగురు మంత్రుల డుమ్మా మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా మార్చి 16న హైకోర్టులో IRR కేసు విచారణ ఉన్న నేపథ్యంలో, ఈ కేబినెట్ గైర్హాజరు అంశం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.
Next Story

