కొలికపూడి ’పల్లె కన్నీరు’ స్టేటస్‌పై టీడీపీలో సెగలు..పల్లా సీరియస్
x

కొలికపూడి ’పల్లె కన్నీరు’ స్టేటస్‌పై టీడీపీలో సెగలు..పల్లా సీరియస్

పిచ్చి స్టేటస్‌లతో మీరు ఎవరిపై పోరాటం చేస్తున్నారు? అంటూ పల్లా నేరుగా నిలదీసినట్లు సమాచారం.


ఏపీ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలి ఒక్కసారిగా కలకలం రేపింది. సొంత ప్రభుత్వం అధికారంలో ఉండగానే, గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ పచ్చ పార్టీలో ముసలం పుట్టించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా కొలికపూడికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు మధ్య జరిగిన చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దుమారం రేపిన పల్లె కన్నీరు పోస్ట్

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇటీవల తన నియోజకవర్గంలో మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రహదారులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగుల ఆవేదన చూసి దుఃఖం ఆగలేదు అంటూ ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్లయింది.

లాబీల్లో పల్లా సీరియస్.. కొలికపూడి

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పార్టీ క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టే వివాదాస్పద స్టేటస్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ అండ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఇలాంటి పిచ్చి స్టేటస్‌లతో మీరు ఎవరిపై పోరాటం చేస్తున్నారు? అంటూ పల్లా నేరుగా నిలదీసినట్లు సమాచారం. క్రమశిక్షణా రాహిత్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం సహించరని, పద్ధతి మార్చుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తే పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించడం కూడా మానేస్తుందని పల్లా శ్రీనివాస్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.

సీనియర్లే మార్గనిర్దేశం చేయాలి

పల్లా శ్రీనివాస్ మందలించడంతో కొలికపూడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అనుభవరాహిత్యం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని, తాను చూసిన వాస్తవాలనే స్టేటస్‌లో పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే, పల్లా హెచ్చరికల నేపథ్యంలో.. నాకు సీనియర్లే మార్గనిర్దేశం చేయాలి అంటూ కొలికపూడి సెటైరికల్ గా వ్యాఖ్యానించినట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

పార్టీలో ఆందోళన

ప్రభుత్వం పనుల్లో వేగం పెంచుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేనే రోడ్ల పరిస్థితిపై నిలదీయడం టీడీపీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగి కొలికపూడిని లైన్లోకి తెచ్చే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story