ప్రతిపక్ష హోదా: గతంలో ఏం జరిగింది?1994 పీజేఆర్ నుంచి జగన్ వరకు
x

ప్రతిపక్ష హోదా: గతంలో ఏం జరిగింది?1994 పీజేఆర్ నుంచి జగన్ వరకు

ఈ నంబర్ గేమ్ లో అంతిమ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.


రాజకీయం అంటేనే అంకెల గారడీ.. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు ఆ అంకెలే ఒక ’ప్రతిపక్ష‘ అస్తిత్వ పోరాటానికి కేంద్రబిందువుగా మారాయి. 175 మంది సభ్యులున్న సభలో 10 శాతం నిబంధన ప్రకారం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 18 అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నది కేవలం 11. సరిగ్గా ఇక్కడే ’రూల్ బుక్‘ కు, ’రాజకీయ సంప్రదాయం‘కు మధ్య యుద్ధం మొదలైంది. 1994లో సంఖ్య తక్కువగా ఉన్నానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీజేఆర్‌కు దక్కిన ప్రతిపక్ష హోదాను వైసీపీ ఆశగా గుర్తుచేస్తుంటే, ’నంబర్ ఉంటేనే హోదా.. లేదంటే కేవలం ఎమ్మెల్యేలే‘ అని కూటమి ప్రభుత్వం నిబంధనల గొడుగు పడుతోంది. అటు అసెంబ్లీలో 11 నిమిషాల మెరుపు వాకౌట్లు, ఇటు హైకోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం.. వెరసి ఏపీ రాజకీయ యవనికపై ’ప్రతిపక్ష నేత‘ కుర్చీ ప్రస్తుతానికి ఒక అపరిష్కృత ప్రశ్నగానే మిగిలిపోయింది. తాజాగా ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఈ సెగ మరోసారి స్పష్టంగా కనిపించింది.

నియమావళి అడ్డంకి.. 10 శాతం నిబంధన

అసెంబ్లీ నిబంధనల ప్రకారం, ఒక పార్టీకి అధికారిక ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆ సభలోని మొత్తం సీట్లలో కనీసం 10 శాతం గెలుచుకోవాలి. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 సీట్లలో 10 శాతం అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో, సాంకేతికంగా ఆ పార్టీకి ఈ హోదా దక్కలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ అభ్యర్థనను తిరస్కరించారు.

నిరసనల మధ్య బడ్జెట్ సమావేశాలు

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభ ప్రారంభమైన కేవలం 11 నిమిషాల్లోనే జగన్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రజల గొంతును వినిపించేందుకు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ విచక్షణాధికారమని, గతంలో తక్కువ సీట్లు ఉన్నా గుర్తింపు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని వైసీపీ బలంగా వాదిస్తోంది.

హైకోర్టులో న్యాయపోరాటం.. రెండు పిటిషన్లు

తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేశారు. 2024 జూలైలో మొదటిసారి కోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని స్పీకర్ 2025 ఫిబ్రవరిలో ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తూ సెప్టెంబర్ 2025లో రిట్ మరో మారు పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ రెండు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ (Constitutional Immunity) ఉంటుందని, సభ నిర్ణయాల్లో కోర్టు జోక్యం పరిమితమని ప్రభుత్వం వాదిస్తుండగా, ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్ అఫిడవిట్‌పై తదుపరి విచారణ ఆధారపడి ఉంది.

కూటమి ప్రభుత్వం.. స్పీకర్ వైఖరి

ప్రభుత్వం, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రధానంగా రూల్ బుక్ నే నమ్ముకున్నారు. 1994లో మరెవరికీ 10% సీట్లు లేనప్పుడు అసలు ప్రతిపక్ష నేతే లేని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండి, క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేత పదవిని కోరడం హాస్యాస్పదం అని మంత్రులు విమర్శిస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడితే మైక్ ఇచ్చేందుకు సిద్ధమని, కానీ హోదా విషయంలో నిబంధనలు అతిక్రమించలేమని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి అసెంబ్లీ రికార్డుల్లో వైసీపీ సభ్యులను సాధారణ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నారు. హైకోర్టు నుండి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు లేదా స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు. అప్పటివరకు అసెంబ్లీలో వైసీపీ పోరాటం సాధారణ సభ్యుల హోదాలోనే కొనసాగనుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు గత చరిత్రను తవ్వి తీసేలా చేస్తోంది. 10 శాతం నిబంధన అనేది ఒక సాంకేతిక అంశం అయినప్పటికీ, గతంలో స్పీకర్లు తమ విచక్షణాధికారంతో అనుసరించిన సంప్రదాయాలు ఇప్పుడు వైసీపీకి ప్రధాన ఆయుధంగా మారాయి.

1994లో పీజేఆర్‌కు లభించిన గుర్తింపు

ప్రస్తుత వివాదంలో వైసీపీ ప్రధానంగా 1994 నాటి ఉదాహరణను ప్రస్తావిస్తోంది. ఆ నాడు ఎన్.టి. రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ చిధ్రమైంది. మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 30 సీట్లు (10 శాతం) లేవు. అయినప్పటికీ, అప్పటి రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూ కాంగ్రెస్ నేత పి. జనార్ధన్ రెడ్డి (PJR) కి ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. సంఖ్యాబలం లేకపోయినా ఒక గొంతుక ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ హోదా ఇచ్చారు.

ఆరంభంలో అసలు ప్రతిపక్షమే లేదు

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో (1956) నుండి దాదాపు 1978 వరకు అంటే ఆరో అసెంబ్లీ వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీకీ అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు లభించలేదు. అప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉండటం, ప్రతిపక్షాలు చీలిపోయి ఉండటమే దీనికి కారణం. 1978లో జనతా పార్టీ 60 మంది ఎమ్మెల్యేలతో తొలిసారి అధికారిక ప్రతిపక్షంగా గుర్తింపు పొంది రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

పార్లమెంటులో తెలుగుదేశం రికార్డు (1984)

రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ ఇలాంటి సందర్భం ఎదురైంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ మరణం తర్వాత వచ్చిన సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు కేవలం 30 సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది. అక్కడ కూడా 10% నిబంధన ప్రకారం 54 సీట్లు ఉండాలి. కానీ, స్పీకర్ విచక్షణ మేరకు పి. ఉపేంద్ర కు ప్రతిపక్ష నేత హోదా లభించింది. ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష హోదా పొందిన ఘనతను నాటి టీడీపీ సాధించింది.

ప్రస్తుత ప్రతిష్టంభన (2024-2026)

విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ సున్నా సీట్లకు పడిపోవడంతో ఆ సమస్య రాలేదు. కానీ ఇప్పుడు వైసీపీ 11 సీట్ల వద్ద నిలిచిపోవడంతో వివాదం రాజుకుంది. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 10 శాతం అంటే కనీసం 18 సీట్లు కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూల్ బుక్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. గతంలో సంప్రదాయాల ప్రకారం పీజేఆర్‌కు ఇచ్చినట్లే ఇప్పుడు తమకు ఇవ్వాలని జగన్ నేతృత్వంలోని వైసీపీ కోరుతుండగా.. నంబర్ ఉంటేనే హోదా అని కూటమి ప్రభుత్వం తెగేసి చెబుతోంది. చరిత్రలో ఉన్న మినహాయింపులు ఇప్పుడు తమకు వర్తింపజేయాలని వైసీపీ న్యాయపోరాటం చేస్తుండగా, నిబంధనలే సుప్రీం అని అధికార పక్షం వాదిస్తోంది. ఈ నంబర్ గేమ్ లో అంతిమ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో వేచి చూడాలి.

Read More
Next Story