
రేఖాగుప్తా ప్రభుత్వానికి ఏడాది .. హామీలు భారీగా.. ఫలితాలు మితంగా..
ప్రజల మిశ్రమ స్పందన .. సమస్యలపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఏడాదిలోనే పూర్తి ఫలితాలు ఆశించడం సరికాదని మరికొందరి అభిప్రాయం..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఫిబ్రవరి 20తో బీజేపీ ప్రభుత్వానికి మొదటి సంవత్సరం పూర్తవుతుండగా, అధికార వర్గాలు తమ ‘రిపోర్ట్ కార్డ్’ను ప్రజల ముందుంచేందుకు సిద్ధమవుతున్నాయి. యమునా నది శుభ్రత, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఆ వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చిందనే చర్చ ఇప్పుడు రాజధానిలో వేడెక్కుతోంది.
కేంద్రంలో, ఢిల్లీ ఎన్‌సిటీలో, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో ‘ట్రిపుల్ ఇంజిన్’ సర్కార్ అని ప్రచారం చేసినప్పటికీ, సాధారణ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదని పలువురు నివాసితులు అభిప్రాయపడుతున్నారు.
యమునా శుభ్రత మాటల్లోనే ?
యమునా నదిని శుభ్రపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అయితే యమునా బజార్ ప్రాంతంలో పడవ నడిపే అభినందన్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కలుపు తొలగింపు యంత్రాలు కనిపించాయని, కానీ కొన్ని నెలల్లోనే అవి మాయమయ్యాయని ఆయన చెబుతున్నారు.
వజీరాబాద్ నుంచి ఐటీవో వరకు నది నీరు ఇంకా నల్లగా, దుర్వాసనతోనే ఉందని స్థానికులు అంటున్నారు. కాలువల నీరు నేరుగా నదిలో కలుస్తూనే ఉందని, వరదల తర్వాత పేరుకుపోయిన మురికిని ఇప్పటికీ పూర్తిగా తొలగించలేదని ఆరోపిస్తున్నారు.
“ప్రభుత్వాలు మారుతాయి… కానీ యమునా పరిస్థితి మాత్రం మారదు.” అని దశాబ్దాలుగా ఘాట్‌ల వద్ద నివసిస్తున్న ఉషా దేవి అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్, ఆర్థిక సాయం వంటి హామీలు కూడా అందలేదని ప్రేమావతి వంటి మహిళలు వాపోతున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని, వ్యాధుల భయం వెంటాడుతుందని స్థానికులు అమ్రికా యాదవ్, కిషన్ భయాందోళన వ్యక్తం చేశారు.
క్రూయిజ్ వాగ్దానం… వాస్తవ పరిస్థితి?
సోనియా విహార్ ప్రాంతంలో యమునా నదిపై క్రూయిజ్ సేవల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్షికోత్సవ రోజున దీనిని ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఓఖ్లా నుంచి వజీరాబాద్ మధ్య ప్రాంతం ఇంకా కలుషితంగా ఉండటం ప్రజల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. భారీగా కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో క్రూయిజ్ సేవలు ప్రారంభం ఎంతవరకు ప్రయోజనకరం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మిశ్రమ స్పందన..
రాజేంద్ర నగర్ ప్రాంతంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రోడ్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, తాగునీటి ఇబ్బందులున్నాయని కాలనీవాసులు పేర్కొన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదని యజ్ఞపతి ఉపాధ్యాయ అంటున్నారు. “అది కాగితాలకు మాత్రమే పరిమితమైంది” అని విమర్శించారు.
అయితే కొందరు మాత్రం ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు పనిచేయాల్సి ఉందని, ఏడాదిలోనే పూర్తి ఫలితాలు ఆశించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లు తమ తీర్పు ఇస్తారని వారు చెబుతున్నారు.
ప్రతిపక్షం దాడి...
ప్రభుత్వం 12 రంగాల్లో విఫలమైందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఆరోపించారు. కాలుష్యం, పర్యావరణ పరిస్థితులు మరింత దిగజారాయని అన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ సౌరభ్ భరద్వాజ్ కూడా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
అధికార రిపోర్ట్ కార్డ్ vs ప్రజల అనుభవం
ఒకవైపు ప్రభుత్వం తన విజయాలను చెప్పుకునేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రజలు ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తున్నారు. యమునా శుభ్రత, మౌలిక సదుపాయాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు కావాలని కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 20న విడుదలయ్యే అధికారిక రిపోర్ట్ కార్డ్ ప్రజల అనుభవాలకు ఎంతవరకు సరిపోతుందో చూడాల్సి ఉంది. ‘ట్రిపుల్ ఇంజిన్’ ప్రభుత్వానికి ఇది కీలకమైన పరీక్షగా మారింది.

