అస్సాం ర్యాలీలో కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు..
x

అస్సాం ర్యాలీలో కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు..

సర్జికల్ స్ట్రైక్స్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, మహిళా రిజర్వేషన్‌పై బీజేపీ వైఖరిని వివరించిన ప్రధాని మోదీ..


Click the Play button to hear this message in audio format

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అస్సాంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ హస్తం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ భద్రత, సైనిక సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.

సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోదీ గుర్తు చేశారు. అయితే, ఈ చర్యల సమయంలో కాంగ్రెస్ పాకిస్తాన్ పక్షాన నిలిచిందని ఆరోపించారు. దేశ భద్రత విషయంలో అలాంటి వైఖరి సరికాదని విమర్శించారు.

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) అంశంపై కూడా కాంగ్రెస్‌ను నిలదీశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. మాజీ సైనికుల ఖాతాల్లో లక్షల కోట్ల రూపాయలు జమ చేశామని వెల్లడించారు.

అస్సాంలో శాంతి స్థాపనపై మోదీ మాట్లాడుతూ..గత పదేళ్లలో కుదిరిన శాంతి ఒప్పందాలను అమలు చేయడం వల్లే రాష్ట్రంలో శాంతి నెలకొన్నదని చెప్పారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, స్థిరత్వం సాధ్యమైందని చెప్పారు.

మహిళల కోసం 33% రిజర్వేషన్ అమలు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. 2029 సాధారణ ఎన్నికల నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ అంశంపై అపోహలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

రైతులు, గిరిజనుల సంక్షేమంపై కూడా ప్రధాని ప్రస్తావించారు. చొరబాటుదారులను తొలగించి, స్థానికులకు భూమి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. అస్సాం ప్రత్యేక ‘జోహా’ బియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లామని వెల్లడించారు.

మొత్తంగా అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల రాజకీయాలను మరింత వేడెక్కించాయి.

Read More
Next Story