
అధికారులే 'బలిపశువులు'.. మంత్రులు మాత్రం 'సేఫ్'!
ప్రజల ప్రాణాలకు వెలకట్టే ఈ డ్రామా ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో పాలకల్తీకి ఓ అధికారిపై వేటు.. డయేరియాకు మరొకరు అవుట్! వికెట్లు పడుతున్నాయి, కానీ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్లు (మంత్రులు) మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో సేఫ్‌గానే ఉన్నారు. రాజమండ్రి సూపరింటెండెంట్ మీద వేటు, శ్రీకాకుళం కమిషనర్ సస్పెన్షన్.. ఇవన్నీ కేవలం ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఆడుతున్న "పొలిటికల్ ఐ-వాష్" తప్ప మరొకటి కాదు అని విపక్షాలు దాడి మొదలు పెట్టాయి.
శ్రీకాకుళంలో చెత్త తొలగిస్తున్న సిబ్బంది
రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కల్తీ పాలు తాగి ఇప్పటికి ఆరుగురు చనిపోయారు. శ్రీకాకుళంలో డయోరియా వ్యాప్తి చెంది ఇద్దరు చనిపోయారు. ఈ రెండు సంఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు కమిషనర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దీంతో సమస్య పరిష్కారమవుతుందా అని అధికారులు రుసరుసలాడుతున్నారు.
మంత్రిగారూ.. మీ ఏసీ గదుల సమీక్షలు చాలు
ఒక జిల్లాలో డయేరియా ప్రబలి ప్రాణాలు పోతుంటే, మున్సిపల్ శాఖా మంత్రికి బాధ్యత లేదా? పాలకల్తీ మాఫియా ఊరూరా విస్తరిస్తుంటే ఆరోగ్య శాఖా మంత్రి ఏం చేస్తున్నారు? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ప్రజారోగ్యంపై మంత్రికి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.
బలిపశువులు అధికారులు మాత్రమేనా?
క్షేత్రస్థాయిలో లోపాలు ఉన్నాయంటే అది పర్యవేక్షణ వైఫల్యం. పర్యవేక్షించాల్సిన మంత్రులు వైఫల్యం చెందినప్పుడు, కేవలం అధికారులను సస్పెండ్ చేసి "మేము కఠినంగా ఉన్నాం" అని మసిపూసి మారేడు కాయ చేయడానికి పనికి వస్తుందే తప్ప మరొకటి కాదు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కమీషన్ల కక్కుర్తి.. ప్రజలకి కన్నీరు
మున్సిపాలిటీల్లో పైపులైన్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయకుండా, పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసి, ఇప్పుడు కమిషనర్లను ఇంటికి పంపితే సమస్య తీరుతుందా? నిధులు ఆపేసిన పాలకుల మీద ఏ వేటు వేయాలి? అని జనవిజ్ఞాన వేదిక నిలదీసింది.
మాఫియాతో దోస్తీ.. అధికారులపై కుస్తీ!
పాలకల్తీ వెనుక ఉన్న అసలు తిమింగలాలు ఎవరు? స్థానిక రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఈ కల్తీ సామ్రాజ్యం నడవడం సాధ్యమేనా? అని రాజమండ్రి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ పాలు సరఫరా చేసే ముఠాల జోలికి వెళ్లే ధైర్యం లేక, ఆస్పత్రిలో సౌకర్యాలు లేక సతమతమయ్యే డాక్టర్లను, సూపరింటెండెంట్లను సస్పెండ్ చేయడం పిరికి చర్య కాదా? అని సోషల్ మీడియా ధ్వజమెత్తింది.
కలుషిత నీరు తాగి సామాన్యుడు చనిపోతే అది డయేరియా మరణం కాదు.. అది ప్రభుత్వం చేసిన "వ్యవస్థాగత హత్య". దీనికి ఏ మంత్రి రాజీనామా చేస్తారు? అని సీపీఐ నేత ఈశ్వరయ్య ప్రశ్నించారు.
సిస్టమ్ కుట్టిన కుట్లు.. పాలకుల పట్టు వీడని సీట్లు!
రాజమండ్రిలో డాక్టర్ సత్యనారాయణను తీసి డాక్టర్ కెనడిని వేశారు.. శ్రీకాకుళంలో కూర్మారావును పక్కన పెట్టారు. సరే! రేపు మరో ఊరిలో నీరు కలుషితం కాదని గ్యారెంటీ ఏంటి?
"అధికారులను మార్చడం అంటే ఇంజిన్ పాడైతే డ్రైవర్‌ను మార్చడం లాంటిది. లోపం ఇంజిన్ (పాలసీ/ప్రభుత్వం) లో ఉంది, డ్రైవర్‌లో కాదు. మంత్రులు తమ పదవులకు అతుక్కుపోయి, కింద స్థాయి సిబ్బందిని బలిపీఠం ఎక్కించడం రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట. "డయేరియాతో ప్రాణం పోయినప్పుడు సంబంధిత శాఖా మంత్రి నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయకూడదు? అని నిలదీశారు. సస్పెండ్ అయిన అధికారుల వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై నిష్పక్షపాత విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? నిధుల కేటాయింపులో విఫలమై, వ్యవస్థను భ్రష్టు పట్టించిన పాలకులను ప్రజలు ఎప్పుడు సస్పెండ్ చేయాలి? అని ప్రశ్నించారు.
అధికారులను బలిపశువులను చేసి మీరు తప్పించుకోవచ్చు కానీ, ప్రజల తీర్పు ముందు ఏ 'సస్పెన్షన్' ఆర్డర్లు మిమ్మల్ని కాపాడలేవు! అని పౌరసమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
ప్రజారోగ్యానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.
Next Story

