
అమరావతికి కాదు..బిల్లుకే వ్యతిరేకం : వైవీ సుబ్బారెడ్డి
రాజ్యసభలో గొంతు నొక్కారని మండిపడ్డారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తమ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నా కేవలం 5 నిమిషాలే సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకంటే తక్కువ సభ్యులున్న బీఆర్‌ఎస్, టీడీపీలకు మాత్రం 10 నిమిషాలకు పైగా సమయం కేటాయించారు అని ఆయన మండిపడ్డారు. ఈ వివక్షపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశామని, అసంపూర్తిగా మిగిలిన తమ ప్రసంగాన్ని రికార్డుల్లోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
నిర్మాణం పేరుతో భారీ దోపిడీ
అమరావతి రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఈ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిని తాము ప్రశ్నిస్తున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్‌కు 14 వేల రూపాయలు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని లూటీ చేయడమే. బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో కూడా ఇంత భారీ వ్యయం చేయలేదు అని ఆయన విమర్శించారు. కేవలం రాజధాని నిర్మాణం ముసుగులో భారీ దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు.
రైతుల హక్కుల మాటేమిటి?
రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో బిల్లులో స్పష్టంగా ఎందుకు పేర్కొనలేదని ఆయన ప్రశ్నించారు. 50 వేల ఎకరాల భూమిని తీసుకున్న ప్రభుత్వం, ఆ రైతులకు ఇచ్చే పరిహారం, ఇతర ప్రయోజనాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరించి కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు.
నిబంధనల ఉల్లంఘనపై విచారణ
రాజ్యసభ గ్యాలరీలో ఉన్న టీడీపీ నేతలను టీవీల్లో చూపించడం, వారి ఫోటోలు పత్రికల్లో రావడంపై సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, గ్యాలరీలో ఉన్నవారిని ప్రదర్శించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ వాదనను వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Next Story

