
‘అధికారిక జాబితా వచ్చాక వివరంగా చెబుతా..’
తమిళనాడులో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారదర్శక లేదన్న కరూర్ నియోజకవర్గ ఎంపీ జ్యోతిమణి; డబ్బు ప్రభావం లేదా ఇతర ప్రయోజనాల ఆధారంగా సీట్ల కేటాయిస్తున్నారని ఆరోపణ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల అసంతృప్తి వ్యక్తమైంది. కరూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎస్. జ్యోతిమణి, సీట్ల ఎంపిక ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేశారు.
నిజమైన కార్యకర్తలకు విలువేది?
డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సీట్ల పంపకం పూర్తిగా పారదర్శకత లేకుండా జరుగుతోందని ఆమె ఆరోపించారు. సుదీర్ఘ చర్చల తర్వాత పారదర్శక విధానం పాటించాలని కోరినా, రాష్ట్ర నాయకత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వం సీట్ల ఎంపికను అత్యంత రహస్యంగా నిర్వహిస్తోందని, ఫలితంగా పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను పక్కన పెట్టి, పార్టీకి ఉపయోగం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి కష్టపడ్డ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డబ్బు ప్రభావం లేదా ఇతర ప్రయోజనాల కోసం సీట్ల కేటాయింపు జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
ఇదే పరిస్థితి కొనసాగితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని కాపాడటం కష్టమని జ్యోతిమణి హెచ్చరించారు. తాను ఈ అంశంపై మౌనం పాటించబోనని, అభ్యర్థుల తుది జాబితా వెలువడిన తర్వాత మరింత వివరంగా స్పందిస్తానని చెప్పారు.
ఏప్రిల్ 23 ఎన్నికలు జరగనున్నాయి. మే 4 ఫలితాలు వెలువడతాయి.

