
జేడీ(యూ)లోకి నితీష్ తనయుడు నిశాంత్ ..
డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఆదివారం (మార్చి 8) అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్)లో చేరారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 40 ఏళ్ల నిషాంత్, పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్', జేడీ(యూ) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కార్యకర్తలు కార్యాలయం వెలుపల గుమిగూడి జెండాలు ఊపుతూ, డ్రమ్స్ వాయిస్తూ నిషాంత్‌కు ఘన స్వాగతం పలికారు.
పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం..
పార్టీలో చేరిన తర్వాత నిషాంత్ మాట్లాడారు. ‘‘నాన్న రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని మనమంతా గౌరవిద్దాం. ఆయన మార్గదర్శకత్వంలో పని చేద్దాం. పార్టీని బలోపేతం చేద్దాం. అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేద్దాం. రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు," అని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పదవి?
ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిశాంత్‌ను కీలక పదవి వరించనుంది. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో నిశాంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హర్నౌత్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యే హరి నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. నిశాంత్ వచ్చే నెలలో రాష్ట్ర శాసన మండలికి ఎన్నికవుతారని పేర్కొన్నారు.
రాజ్యసభకు నితీష్ కుమార్..
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ చర్య నాయకత్వ మార్పునకు సంకేతం కాగా నితీష్ రాజకీయ వారసుడిగా నిశాంత్ కొనసాగనున్నారు.

