నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ ప్రస్థానం.. అయినా ఆయనలో నేర్చుకోవాలనే తపన మాత్రం సెకనుకు 70 మైళ్ల వేగంతో దూసుకెళ్తూనే ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా.. హోదాను పక్కన పెట్టి, సామాన్య కార్యకర్తలతో కలిసి శిక్షణ తరగతుల్లో కూర్చొని పాఠాలు వింటున్న చంద్రబాబు నాయుడును చూస్తుంటే ’నారా వారు నిత్య విద్యార్థి‘ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం అన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. కాలంతో పోటీ పడుతూ, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లాంటి ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టడంలోనైనా, పార్టీ కార్యాలయంలో పత్తిపాటి పుల్లారావు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంలోనైనా ఆయన శైలే వేరు. నేర్చుకోవడానికి వయసు అడ్డుకాదని, పాలనలో ప్రతిరోజూ కొత్తదనమే పరమావధి అని నమ్మే ఈ ’ముఖ్యమంత్రి విద్యార్థి‘ ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నేతల మధ్య 'సామాన్య కార్యకర్త'లా..
టీడీపీ పార్టీ ఆఫీసులో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.. అంతా సీరియస్‌గా నోట్స్ రాసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హఠాత్తుగా గదిలోకి ప్రవేశించారు. అయితే ఆయన వెళ్ళింది వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వడానికి కాదు. ఒక సామాన్య శిక్షార్థిలా మారి పాఠాలు వినడానికి. అక్కడ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు క్లాస్ చెబుతుంటే, ఏమాత్రం హడావుడి చేయకుండా అందరి మధ్యలో కూర్చొని ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలా చంద్రబాబు విన్న తీరు అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. తనకున్న అపారమైన రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి, పార్టీ భావజాలం.. కార్యకర్తల ప్రాధాన్యం గురించి చెబుతున్న ప్రతి మాటను ఆయన శ్రద్ధగా గమనించారు. అటు ముఖ్యమంత్రి కార్యకర్తలతో కలిసి పాఠాలు వింటుంటే, ఇటు మంత్రి నారా లోకేష్ ప్రతి బృందం దగ్గరకు వెళ్లి, సభ్యులతో ముచ్చటిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం గమనార్హం. తండ్రీకొడుకులిద్దరూ ఇలా క్యాడర్‌తో మమేకమై ’నాయకుడంటే నిర్దేశించడమే కాదు.. అందరితో కలిసి నడవడమే అని నిరూపించారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు
చాలామందికి వయసు పెరిగే కొద్దీ నేర్చుకోవాలనే తపన తగ్గుతుంది. కానీ నారా చంద్రబాబు నాయుడు విషయంలో అది రివర్స్. జనవరి 2026లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ’నేను ఎప్పుడూ నిత్య విద్యార్థిని. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు‘ అంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కేవలం రాజకీయ ఎత్తుగడలే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచాన్ని శాసిస్తున్న AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) , డేటా అనలిటిక్స్ వంటి సంక్లిష్టమైన సాంకేతికతలను కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా అందిపుచ్చుకుంటున్నారు. ప్రతిరోజూ తాను నేర్చుకునే ప్రతి కొత్త విషయం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెస్తుందో, పాలనను ఎంత సులభతరం చేస్తుందో అని ఆయన నిరంతరం మథనపడుతుంటారు. ’అప్‌డేట్ అవ్వకపోతే అవుట్ డేట్ అయిపోతాం‘ అనే సూత్రాన్ని నమ్మే ఆయన, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ఏపీని అగ్రభాగాన నిలబెట్టేందుకు తాను కూడా ఒక విద్యార్థిలా మారుతూ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్న అంశం. పాలనలో AI .. విజన్‌లో స్వర్ణాంధ్ర
చంద్రబాబు నాయుడి విజన్ ఇప్పుడు కేవలం ఫైళ్లకు పరిమితం కాలేదు. అది అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానమైంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కేవలం మనుషుల ఆలోచనలతోనే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , డేటా అనలిటిక్స్ సాయంతో అద్భుతాలు చేయాలని ఆయన ఒక బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టెక్నాలజీని ఇతరులకు చెప్పడమే కాదు, తాను కూడా స్వయంగా నేర్చుకుంటూ ఒక ’టెక్-లీడర్‘గా నిలుస్తుండడం విశేషం. ఆయన కలలుగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకారం కావాలంటే అధికారుల నుంచి అట్టడుగు స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని ,గతంలో అనేక మార్లు ఆయన పిలుపునిచ్చారు. నేర్చుకోవడానికి వయసు ఒక అడ్డంకి కాదు.. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే వెనుకబడిపోతాం అంటూ అధికారులకు ఆయన పదునైన హితవు పలికారు కూడా. పాలనలో పారదర్శకత, వేగం పెరగాలంటే టెక్నాలజీయే ఏకైక మార్గమని నమ్ముతూ.. ఏపీని భవిష్యత్ తరాల కోసం ఒక మోడల్ స్టేట్‌గా మార్చే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ నిత్య విద్యార్థిగా మారి కొత్త అంశాలను ఒంటబట్టించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అనేది కూటమి వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.