వైసీపీకి నాగబాబు ఉచిత సలహా
x

వైసీపీకి నాగబాబు ఉచిత సలహా

రప్పా రప్పా అంటే ఉన్న ఒక్క సీటు కూడా పోతుందని వైసీపీకి నాగబాబు చురకలు.


మళ్ళీ అవకాశం వస్తే అడ్డం వచ్చిన వారినల్లా ’రప్పా రప్పా‘ నరుకుతాం.. అంటూ వైసీపీ నాయకులు పదేపదే మాట్లాడుతున్నారని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చురకలు అంటించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఇలాంటి బెదిరింపులకు దిగితే, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 11 సీట్లలోని రెండు ఒకట్లు (11) పోయి.. చివరకు మిగిలిన ఆ ఒక్కటి కూడా పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీకి ఇదే తన సలహా అని స్పష్టం చేశారు. ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వందలాది మంది జనసైనికుల మధ్య నాగబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అభివృద్ధి, త్యాగం, నిబద్ధతలే జనసేనను ఈ స్థాయికి చేర్చాయని ఆయన పునరుద్ఘాటించారు.


త్యాగాలకు నిదర్శనం ఈ రోడ్లే

జనసేన పార్టీ పన్నెండేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని, పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న సవాళ్లతో పోలిస్తే వైసీపీ బెదిరింపులు లెక్కలోనివి కావని నాగబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కళకళలాడుతున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రోడ్లు నిర్మించడం వల్ల మారుమూల గ్రామాలకు కూడా అంబులెన్స్‌లు వెళ్లగలుగుతున్నాయని వివరించారు.

అనకాపల్లి కంటే పిఠాపురమే ముఖ్యం
గత ఎన్నికల సమయంలో అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నా, పార్టీ ప్రయోజనాల కోసం ఆ సీటును వదులుకోవడం తనకు సంతృప్తిని ఇచ్చిందని నాగబాబు గుర్తు చేసుకున్నారు. ఆ నిర్ణయం వల్లే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేయగలిగానని చెప్పారు. కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి జనసేనలో ఉందని, అందుకే ఇక్కడ సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నత పదవుల్లోకి రాగలుగుతున్నారని కొనియాడారు.
కూటమి ఐక్యత పదిహేనేళ్లు
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం వైసీపీ ఆటలు సాగవని నాగబాబు హెచ్చరించారు. ఈ ఐక్యత మరో 15 ఏళ్లకు పైగానే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 11 నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీకి అవకాశం ఇస్తే, అసెంబ్లీకి రాకుండా ఆ 20 లక్షల మంది గొంతుకను ఆ పార్టీ నేతలు నొక్కుతున్నారని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం, రాబోయే మూడేళ్లలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని వెల్లడించారు.
Read More
Next Story