
నా పోరాటం ఆస్తుల కోసం కాదు..నిజాల కోసం: షర్మిల
ఆస్తుల వివాదంపై విజయమ్మ లేఖే సాక్ష్యమని షర్మిల అన్నారు.
తన పోరాటం ఆస్తుల కోసం కాదని.. నిజాల కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తల్లి విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ, ఆ లేఖలోని ప్రతి అక్షరం వాస్తవమని ఆమె నొక్కి చెప్పారు. ఆస్తుల పంపిణీపై నా తల్లి ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చారు. ఒకవేళ నేను ఒత్తిడి చేసి సంతకం చేయిస్తే, అది నా సంతకం కాదని ఆమె చెప్పలేరా? అని ప్రశ్నించారు. జగన్‌కు ధైర్యం ఉంటే నేరుగా సమాధానం చెప్పాలి తప్ప, సోషల్ మీడియా సైన్యంతో అబద్ధపు ప్రచారాలు చేయించకూడదని మండిపడ్డారు.
వివేకా హత్య కేసు: వైసీపీ నేతల భయం ఎందుకు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని షర్మిల నిలదీశారు. తాను వివేకా మరణానికి సంబంధించిన నిజాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంటే, కావాలనే ఆస్తుల గొడవను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. నేను ఇంకొకరి ఆస్తిని అనుభవించడం లేదు, ఆస్తులే నా అజెండా అయితే ఎప్పుడో కోర్టులను ఆశ్రయించేదానిని అని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం ఆస్తులను అనుభవిస్తోంది జగన్ మాత్రమేనని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ 2026 ఒక వంచన
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ 2026పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉండగా, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని, దీనిని తాము అంగీకరించబోమని హెచ్చరించారు.
సాక్షి పత్రికపై విమర్శనాస్త్రాలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని, సత్యమేవ జయతే అని నినాదాలు చేసే సాక్షి పత్రికలో కనీసం చివరి పేజీలో కూడా విజయమ్మ లేఖను ప్రచురించకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సత్యం పట్ల, సొంత తల్లి మాటల పట్ల జగన్‌కు ఆయన మీడియాకు ఉన్న గౌరవం ఇదేనా అని ఆమె ఎద్దేవా చేశారు. తన పోరాటం ఆస్తుల పంపకాలపై కాదని, విలువలు నిజాల కోసమని ఆమె పునరుద్ఘాటించారు.
Next Story

